సిక్కోలు సఖి సిరులు కురిపించాలి..
Ens Balu
3
మబుగాం
2022-03-02 08:07:32
సిక్కోలు సఖి బ్రాండ్ పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాలు సాగనున్న శ్రీకాకుళం జిల్లా ఉత్పత్తులకు మంచి గిరాకీ లభించి, మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు, మండల మహిళా సమాఖ్య, సెర్ఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంఘాలు తయారుచేస్తున్న ఉత్పత్తులను 'సిక్కోలు సఖి' పేరుతో మార్కెటింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన లోగో, గోడ పత్రికలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మబుగాం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కోలు సఖి ఉత్పత్తులు దేశీయంగా అంతర్జాతీయంగా మంచి నాణ్యతతో అందించాలని, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల అందుబాటులో లేని, పరిచయం కూడా లేని ఉత్పత్తులు శ్రీకాకుళం జిల్లాలోనే తయారు కావడం గర్వకారణమని చెప్పారు. డిఆర్డిఎ పీడీ బి.శాంతి శ్రీ మాట్లాడుతూ జిల్లా ఉత్పత్తులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, అయితే ఇప్పటి వరకూ ఒక బ్రాండ్ పేరు అంటూ ఏదీ లేకపోవడంతో సిక్కోలు సఖి పేరుతో మార్కెటింగ్ చేయాలని నిర్ణయించామని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే.శ్రీధర్, పోలాకి జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, పలువురు గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.