ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫారంను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తప్పని సరిగా ధరించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. నెల్లిమర్ల మున్సిపాల్టీ పరిధిలోని వార్డు సచివాలయం-04 ను, ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూనిఫామ్ ధరించని సచివాలయ సిబ్బందిపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందుగా సచివాలయ సిబ్బంది హాజరు, ఇతర రిజిష్టర్లను పరిశీలించారు. సిబ్బంది బయోమెట్రిక్ హాజరును తనిఖీ చేశారు. ఓటిఎస్, జగనన్న గృహ నిర్మాణం, పోలియో వేక్సినేషన్, కోవిడ్ వేక్సినేషన్, రేషన్ కార్డుల జారీ, పెండింగ్ దరఖాస్తులు, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై ఆరా తీశారు. ఓటిఎస్ అమలు జాప్యంపై ప్రశ్నించారు. అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరైన వారందరిచేతా ఇళ్లు కట్టించాలని, అర్హులైన కొత్తవారికి కూడా 90 రోజుల పథకం క్రింద పట్టా మంజూరు చేయాలని సూచించారు. జగనన్న తోడు పథకం ఎంతమందికి అందిందీ, తిరిగి రుణాన్ని ఎంతమంది చెల్లిస్తున్నదీ ఆరా తీశారు. ఇంటింటి చెత్త సేకరణ, యూజర్ ఛార్జీల వసూలుపై విరాలు తెలుసుకున్నారు. దిశయాప్‌ను ప్రతీఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకొనేలా చూడాలని సూచించారు. ఈ తనిఖీలో నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్, తాశీల్దార్ కెవి రమణరాజు, ఇఓపిఆర్‌డి ఎం.భానూజీరావు, హౌసింగ్ ఎఇ కెవి రమణరాజు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.