ఎంఎస్ఎన్ ఆస్తులను ప్రభుత్వం కాపాడాలి..
Ens Balu
2
Kakinada
2022-03-03 11:16:55
కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎం.ఎస్.ఎన్ పి.జి సెంటర్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న బయోడైవర్సిటీ పార్కుకి కేటాయించిన ఐదు ఎకరాలు వెనుకకు తీసుకోవాలని, ఎమ్.ఎస్.ఎన్ ఆస్తులను కాపాడాలని పిజి సెంటర్ స్పెషల్ ఆఫీసర్ కమల కుమారికి ఎస్ఎఫ్ఐ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా గురువారం కాకినాడలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ, మల్లాడి సత్యలింగ నాయకర్ విద్యాదానం పేరుతో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యను అందించాలనే ఉద్దేశంతో భూములు ఇచ్చారని చెప్పారు. దానిలో భాగంగానే పి.జి సెంటర్ కు 40 ఎకరాలు ఇచ్చారని.. నాయకర్ ఆశయం మేరకు ఈ స్థలంలో విద్యకు సంబంధించిన, విద్యార్థులు సంబంధించిన కార్యకలాపాలు చేయాలని వీలునామా కూడా రాసి ఉందని గుర్తుచేశారు. నాయకర్ వీలునామా కు వ్యతిరేకంగా పీజీ సెంటర్ లో ఐదెకరాలు బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వ స్థలంలో పార్క్ ఏర్పాటు చేసి రుసుము వసూలు చేయడం అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడమే అని ఆరోపించారు. జిల్లాల విభజనలో భాగంగా భవిష్యత్తులో పి జి సెంటర్ యూనివర్సిటీ అయ్యే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని బయట ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు మాధవ్, నాయకులు శైలజ రెడ్డి, సుస్మిత, మిన్నీ సైనిక్ భార్గవ్ మేఘన, ప్రసన్న, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.