విజయనగరం జిల్లాలో అపరాలు సాగు చేసే రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని, పప్పు ధాన్యాలకు కనీస మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వలే.. పప్పు ధాన్యాలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖ అధికారులతో గురువారం ఆయన తన ఛాంబర్లో సమావేశమయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో కొంతమంది తక్కువ ధరకే రైతుల నుంచి పప్పు ధాన్యాలు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అపరాలు సాగు చేసే రైతులకు న్యాయం జరిగేలా ఈ రబీలో పండించే పప్పు ధాన్యాలకు కనీస మద్ధతు ధర లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ డీఎం షేక్ యాసిన్ ను జేసీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పప్పు ధాన్యాలు ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో సోదాహరణంగా వివరించారు. మినుములు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధర రూ.6,300 ఉండగా బయట మార్కెట్లో రూ.5,600 ఉందని, పెసలు కనీస మద్ధతు ధర రూ.7,275 ఉండగా బయట మార్కెట్లో రూ.6,300 ఉందని, మొక్కజొన్న రూ.1,870 ఉండగా బయట మార్కెట్లో రూ.1,800 ఇస్తున్నారని, జొన్నలు రూ.2,758 ఉండగా మార్కెట్లో రూ.2,300గా నిర్ణయించారని, రాగి రూ.3,377 కి గాను బయట రూ.2,200 ఇస్తున్నారని వివరించారు. ఈ తారతమ్యాలు లేకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధరలు అందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలని, ప్రచారం కల్పించాలని మార్క్‌ఫెడ్ అధికారులను జేసీ ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అనుకూలమైన కేంద్రాలను గుర్తించాలని, సామగ్రిని సమకూర్చుకోవాలని, సిబ్బందికి శిక్షణలు ఇప్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్ డీఎం షేక్ యాసిన్, మార్కెటింగ్ ఏడీ శ్యామ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.