శరీర జీవక్రియలు అన్నిటికీ అతి ముఖ్యమైన అవయవం కిడ్నీలు అని వీటి పనితీరు మందగించినా, పూర్తిగా నిలిచిపోయినా రకరకాల ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున వాటిని పదిలంగా కాపాడుకోవాలని ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన శరీరంలో చిక్కుడుగింజల ఆకారంలో పిడికిలి సైజు లో నడుముకి ఇరువైపుల ప్రక్కటెముకల వెనుక భాగంలో కిడ్నీలు ఉంటాయని ఏదైనా కారణం చేత అవి దెబ్బతింటే అశ్రద్ధ చేయరాదని అన్నారు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ మలినాలను మూత్ర రూపంలో బయటికి పంపిస్తాయి అని అన్నారు. కిడ్నీలపై పనిభారం పెరిగే కొద్దీ అవి దెబ్బతింటాయని అన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, రక్తహీనత, కిడ్నీలో రాళ్లు, మానసిక ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ మందులు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. అనంతరం వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవీణ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలింగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.