వచ్చే సోమవారానికి రూ.17 కోట్లు ఖర్చు చేయాలి..


Ens Balu
3
Paderu
2020-09-17 19:22:06

విశాఖ ఏజెన్సీలో నిర్దేశించిన వ్యయ లక్ష్యాలను సాధించలేని ఇంజనీరింగ్ అధికారులపై ఐటిడిఏ పిఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువా రం ఐటిడిఏలో గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, పి ఐ యు ఇంజనీరింగ్ విభాగం, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌ల స్ధల సమస్యలపై సమీక్షించారు. భవన నిర్మాణాలకు తలెత్తిన భూమి సమస్యలు, అవసరమైన భూమి ఎక్కడ లేదు అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలకు అవసరమైన భూమి సమస్యలను పరిష్కరించి భూమిని కేటాయించాలని ఆర్ డి ఓ ను ఆదేశించారు. ఏ గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం , వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్ నిర్మించాలో దిశ నిర్ధేశం చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అనుసంధానంతో చేపట్టిన గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు నిర్మాణపు పనుల పరోగతి, ఎం. బుక్ రికార్డు, చెక్ మెజర్‌మెంట్‌లు సక్రమంగా చేసి వ్యయ లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు.కాంట్రాక్టర్‌లకు సకాలంలో చెల్లింపు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పనులు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేయడానికి వెనుకాడనని హెచ్చరికలు జారీ చేసారు.వారానికి డి. ఇ పరిధిలో ఎంత ఖర్చు చేయాలో లక్ష్యాలను నిర్ధేశించారు. వచ్చే సోమవారానికి రూ.17 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రతీ మండలానికి ఐదుగురు ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ నియమించారని,పనులు జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి, పంచాయతీ రాజ్ ఎస్. ఇ. జి.సుధాకర రెడ్డి , గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ ఆర్ . కుసుమ భాస్కర్, పి ఐ యు ఇ ఇ , శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ డి. ఇ లు డి వి ఆర్ ఎం రాజు, అనుదీప్,పంచాయతీరాజ్ డి ఇ కొండయ్యపడాల్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.