సమయ పాలన పాటించని సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయానికి విధులకు హాజరుకాని సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని అలకానంద కాలనీ 47వ వార్డు సచివాలయాన్ని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఉదయం 9.55 గంటలకే సచివాలయాన్ని చేరుకున్నారు. ఆ సమయానికి సచివాలయంలో కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఉదయం 10.15 గంటలు వరకు, సుమారు 20 నిమిషాలపాటు కలెక్టర్ సచివాయంలోనే ఉన్నప్పటికీ, మిగిలిన సిబ్బంది హాజరు కాకపోవడంతో, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, మున్సిపల్ సచివాలయాల సమన్వయకర్త హరీష్‌ను ఆదేశించారు.