ముత్యాలమ్మతల్లి జాతర విజవంతం చేయాలి
Ens Balu
2
Paderu
2022-04-23 08:59:22
జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరను భక్తి శ్రద్దలతో విజయవంతం చేయాలని ఐటిడిఏ పిఓ రోణంకిగోపాల క్రిష్ణ స్పష్టంచేసారు. శనివారం సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో కలిసి ఐటిడి ఏ సమావేశ మందిరంలో విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ అధికారులు,వెలుగు , వైద్య ఆరోగ్యశాఖ , ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27 వతేదీ నుండి 30 వతేదీ వరకు నిర్వహిస్తున్న అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకరిస్తామన్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. జాతర కు వచ్చే భక్తులకు నిరంతరం తాగునీటి సరఫరా చేయాలని , మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సూచించారు. ఉత్సవంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు చెప్పారు. ఆలయం వద్ద తగిన పోలీస్ బందోబస్తు ,సిసి కెమెరాలు, కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని సూచించారు. ఈనెల 27 వతేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున పగటి పూట మైక్‌సెట్లు, ఇతర సౌండ్ సిస్టంలు వినియోగించ కూడదన్నారు. ఉత్సవంలో వెలుగు, జిసిసి, ఐసిడి ఎస్, వైద్య ఆరోగ్యశాఖ స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విడివికె ఉత్పత్తులను విక్రయించాలని అన్నారు. ఉత్సవ ప్రాంగణంలో అగ్నిమాపక శకటం, అంబులెన్సును అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ఎపిఓ(పిటిజి) ఎం. వేంకటేశ్వరరావు, చింతపల్లి తాహశీల్దార్ గోపాల క్రిష్ణ, ఎంపిడిఓ ఎల్.సీతయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, వెలుగు ఎపిడి మురళి, సి ఐ టి.శ్రీను, చింతపల్లి ఎంపిపి వంతాల బాబూరావు ఉత్సవ కమిటీ సభ్యులు డి.హేమంత్ కుమార్,జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.