సత్యసాయి మార్గం అనుసరణీయం..
Ens Balu
3
Sarpavaram
2022-04-24 07:28:32
ప్రార్థించే పెదవుల కన్నా సేవచేసే చేతులు మిన్న వంటి ప్రబోధాలు ద్వారా సమాజసేవ చేయమని భక్తులను ప్రోత్సహించిన సత్య సాయి బాబా ఆశయసిద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సత్య సాయి బాబా ఆరాధనోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన, మెరుగైన వైద్యం, ప్రకృతి వైపరీత్యాలలో నిరాశ్రయులకు నీడ కల్పించడం, ఆకలిదప్పులు తీర్చడం.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను సత్య సాయి బాబా ప్రవేశపెట్టారని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారు అని అన్నారు. సేవల ద్వారా ప్రపంచ దేశాలలో లక్షలాదిమంది హృదయాలలో పిలిస్తే పలికే దైవంగా నిలిచిపోయిన సమాజవాది, సంస్కర్త సత్య సాయి బాబా అని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, మల్లీశ్వరి, రాజా, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.