సొంత ఇంటితో జీవితానికి భరోసా, సామాజిక హోదాతో పాటు పిల్లలకు వారసత్వ ఆస్తి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో నవరత్నాలలో భాగంగా పేదలందరికి ఇళ్లు పథకంలో విశాఖ నగరంలో లక్షా 24 వేల 581 కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు, రాష్ట్రంలో ఫేజ్-2 కింద 3,03,581 కుటుంబాలకు గృహ మంజూరు పత్రాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఒక్క గ్రామంలోనే 10,228 ఇళ్లు నిర్మాణమవుతున్నాయన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్, పార్కలు, రోడ్లు తదితర సౌకర్యాలు వస్తాయన్నారు. పాదయాత్ర సమయంలో 25 లక్షల గృహాలకు హామీ ఇచ్చినప్పటికి అంతకు మించి 30 లక్షల 70 వేల గృహాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ పరిధిలో సెంటు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో వున్నాయని, ఇంకా 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నట్లు తెలిపారు. 2.60 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ గృహ నిర్మాణానికి 5 వేల 469 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. పేధలందరికీ ఇళ్ల నిర్మాణాల కారణంగా రాష్ట్ర జిడిపి వృద్ధి రేటు పెరుగుతోందని తెలిపారు. కార్మికులకు 25.92 కోట్ల పని దినాలు కల్పించామని, 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.
ఇళ్లు మంజూరు కానివారు బాధపడవద్దని వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకొంటే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. రు. 2 లక్షల 12 వేల మంది ధరఖాస్తు పెట్టుకోగా ఒక లక్షా 12 వేల మందికి మంజూరు చేసినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి మహిళలలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి రూ.35 వేల రుణం ఇప్పిస్తామన్నారు. దీని వలన గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయన్నారు. కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కాలనీల్లో తాత్కాలిక గొడౌన్లు ఏర్పాటు చేసి ఇసుక, సిమెంటు, శానిటరీ, తదితరమైనవి ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. 340 అడుగుల గృహంలో ఒక బెడ్ రూం, నివాసం గది, కిచెన్, బాత్రూం, వరండాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికి రెండు ఫ్యాన్లు, ఎల్ఇడి బల్బులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి పథకాలు అందిస్తున్నారని తద్వారా అవినీతిలేని వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా అక్కా చెల్లెమ్మలకు మంచి చేయడంలో జగనన్న వెనుకడుగు వేయడన్నారు.
పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యల పై మాట్లాడుతూ పంచగ్రామాల సమస్యలు ప్రస్తుతం కోర్టులో ఉన్నదని చెప్పారు. తాడి గ్రామ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుందని, ఆ ప్రాంతానికి రూ. 56 కోట్లు వారం రోజుల్లోనే మంజూరు చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ఎడమకాల్వ ద్వారా శ్రీకాకుళం వరకు గోదావరి నీరు తీసుకువెళతామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, గృహ మంజూరు పత్రాలు ఆయన పంపిణీ చేశారు. గాజువాక నుండి వచ్చిన మహిళ నాగమణి మాట్లాడుతూ చాలి చాలని జీతంతో పిల్లలుతో జీవనం సాగిస్తున్నామని, అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కరోనా సమయంలో ఇంటి యజమాని వచ్చి ఇళ్లు ఖాలీ చేయమని చెప్పేసరికి బాధపడ్డామని, ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు కలుగకుండా జగనన్న ఇస్తున్న గృహంలో కుటుంబంతో సంతోషంగా ఉంటామని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పట్టాలు, గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు మూడు సంవత్సరాలలో పైడివాడ అగ్రహారం మున్సిపాలిటీగా మారబోతుందన్నారు. పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 70 వేల కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 2 లక్షల మందికి శాశ్వత గృహాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో ఉన్న పంచగ్రామాల భూ సమస్య, తాడి గ్రామ కాలుష్య సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ, పట్టాల పంపిణీకి ల్యాండ్ పూలింగ్, జిల్లా అభివృద్ధిని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ అధ్యక్షులు జి. సుభద్ర, విఎమ్ఆర్డిఏ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఎ. మల్లికార్జున, రవి శుభాష్, పార్లమెంటు సభ్యులు బివి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, జి. మాధవి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు,, శెట్టి ఫల్గుణ, కె. భాగ్యలక్ష్మి వాసుపల్లి గణేష్ కుమార్, శెట్టి ఫాల్గుణ, జివిఎంసి కమీషనర్ లక్ష్మీశా, ఎస్పీ గౌతమ్ శాలిని, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అదనపు ఎస్పీ కె. శ్రావణి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికిపూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.