వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా పక్షపాతి
Ens Balu
2
Narsipatnam
2022-04-29 10:03:08
మహిళల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగానే సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన వైయస్ఆర్ సున్నా వడ్డీ చెక్కు ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ, నర్సీపట్నం మునిసిపాలిటీలో 2019 నాటికి డ్వాక్రా మహిళలకు 30 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నాయన్నారు. గత రెండు సంవత్సరాలుగా సుమారు 15 కోట్ల రూపాయలు రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసిందన్నారు. నియోజకవర్గం లో 2019 నాటికి సుమారు 160 కోట్ల రూపాయలు రుణాలు ఉండగా, 80 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు. డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకు రుణాల వడ్డీ భారం పడకుండా ఆ వడ్డీని నేరుగా బ్యాంకులకు చెల్లిస్తున్న ప్రభుత్వం ఒక్క జగనన్న ప్రభుత్వమే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, మాఫీ చేయలేదు సరికదా 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల ఆర్థిక పరిస్థితి చూసి చలించి పోయిన ముఖ్యమంత్రి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సున్నా వడ్డీ పథకాన్ని నవరత్నాలలో చేర్చారన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా సున్నా వడ్డీ బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిoదని, మూడో విడతగా 2020 -21 సంవత్సరానికి గాను సకాలంలో రుణాలు చెల్లిస్తున్న అన్ని సంఘాలకు సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే అన్నారు. మూడో విడతలో నర్సీపట్నం మున్సిపాలిటీలో సున్నా వడ్డీ పథకం ద్వారా 1276 డ్వాక్రా గ్రూపులకు గాను రూ.2 కోట్ల 31 లక్షల 40 వేలు ఆర్థిక లబ్ధి చేకూరింది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్లు గొలుసు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, మెప్మా పిడి సరోజిని, మున్సిపల్ కౌన్సిలర్లు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైఎస్ఆర్ నాయకులు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు, పాల్గొన్నారు.