గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ముద్దాయికు విధించిన శిక్షను స్వాగతిస్తున్నామనీ, కేవలం 9 నెలల కాలంలో హత్య కేసులో శిక్ష విధించటం సంచలనం అని రాష్ట్ర వైసిపి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం కాకినాడ రూరల్ లో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా శశికృష్ణ అనే దుర్మార్గుడు రమ్యను కత్తితో పొడిచి హత్య చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందనీ సదరు కేసులో పొలీసు వారు హత్యా నేరానికి సంబంధించిన అన్ని విషయాలను కోర్టుకు అందజేయటంవలన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుకి మరణశిక్ష విధించటం ఆనందకరమన్నారు. ఆది నుంచి రాష్ట్ర వైసిపి ప్రభుత్వం మహిళలకు రక్షణగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. దిశా లాంటి చట్టాలు తీసుకురావటం, కఠినమైన శిక్షలు విధిస్తామనీ ప్రచారం చేస్తున్నా కొంతమంది దుర్మార్గుల వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనీ ఈ కేసులో ముద్దాయికు ఉరిశిక్ష అమలు చేయడం వలన సమాజంలో కాస్త అవగాహన రావచ్చుననీ తెలిపారు. ఈ కేసులో త్వరగతిన వివరాలు సేకరించి కోర్టుకు అందచేసిన పోలీసువారికి కృతజ్ఞతలు తెలుపున్నామనీ, ఇలాంటి శిక్షలు అమలు చేయటం వలన మహిళలపై దాడులు తగ్గవచ్చుననీ, పోలీసువారికి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామనీ ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు.