మీ గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది..
Ens Balu
3
శ్రీకాకుళం రూరల్
2022-04-30 06:25:10
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( నరేగా) ద్వారా మీ గ్రామంలోని రహదారులు, చెరు వులను అభివృద్ధి చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని వేతనదారులకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ భైరి నాగులపేట, గార మండలం వాడాడలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వేతనదారులతో ముచ్చటించిన కలెక్టర్ మీరు ఎంత పనిచేస్తారో అంత వేతనం లభిస్తుందని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వేతనదారులు ఇబ్బంది పడకుండా ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నుండి రోజుకు రూ.250/-ల వరకు వేతనం లభించే అవకాశం ఉందని , కాని రూ.140/-లు వేతనం లభించేలా పనులు చేస్తున్నారని, ఈ పనులు మరింత చురుగ్గా సాగాలన్నారు. మీరెంత పనిచేస్తారో ప్రభుత్వం నుండి మీ గ్రామానికి, మండలానికి అన్ని నిధులు వస్తాయని కలెక్టర్ సూచించారు. మన ఊరికి ఎంత చేయగలుగుతామో అంత చేయాలని, తద్వారా మీ గ్రామానికి మంచి రహదారి, చెరువు లభిస్తుందని కలెక్టర్ హితవు పలికారు. మీరు చేపట్టే పనుల వలన మండలానికి మరిన్ని నిధులు వచ్చేలా చేయగలుగుతామని, పనిదినాలు కల్పించడం, రోజువారి వేతనం లభించేలా చేయడమే కాకుండా మీ ప్రాంత అభివృద్ధి చేసుకునేలా అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామంలో సుమారు రూ.10 లక్షల వరకు ఉపాధి పనులు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తిచేసుకుని వేతనదారులు లబ్దిపొందాలని కోరారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం ఎం.పి.డి.ఓ ఆర్.వెంకట్రామన్, తహశీల్దార్ కె.వెంకటరావు, డ్వామా పథక సంచాలకులు ఎం.రోజారాణి, ఏ.పి.డి అలివేలు మంగమ్మ, జూనియర్ ఇంజినీర్ పి.ముకుందబాబు, ఏ.పి.ఓ కె.సీతారాం, టెక్నికల్ అసిస్టెంట్ జి.రజనీ,వేతనదారులు తదితరులు పాల్గొన్నారు.