జీడితోటల నష్టాలను పరిశీలించిన కలెక్టర్


Ens Balu
4
డోకిశిల
2022-04-30 08:03:07

పార్వతీపురం మండలం డోకిశిల గ్రామంలో జీడి పంట నష్టాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. జిల్లాలో జీడి పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ఉద్యానవన శాఖ అదనపు సంచాలకులు ఎం. వెంకటేశ్వర్లు నేతృత్వంలో బాపట్ల జీడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డా. ఉమా మహేశ్వర రావు, డా. నాగేంద్ర రెడ్డి, రస్తా కుంటుబాయి శాస్త్రవేత్త డా. హరి కుమార్, విజయనగరం ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు డా. ఆర్.శ్రీనివాసరావు బృందం డోకిశిల గ్రామంలో శనివారం పర్యటించింది.  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బృంద సభ్యులతో కలిసి పరిశీలించారు. బృంద సభ్యులు, రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో అకాల వర్షాలు, గాలుల వల్ల నష్టపోయిన విధానం, ఇతర వివరాలు తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో దిగుబడులు, విపత్తుల పరిస్థితుల్లో దిగుబడుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తోటల పునరుజ్జీవనానికి చేపడుతున్న అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటకు సంబంధించిన నష్టాలకు తగు న్యాయం చేయాలని కోరారు. వాటిని పరిశీలించి నివేదిక అందజేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.  ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా ఉద్యానవన అధికారి కె.వి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు