రూ. 5 కోట్లతో వారపు సంతల అభివృధ్ది..


Ens Balu
2
పాడేరు
2020-09-18 18:45:24

విశాఖ మన్యంలో ప్రధానమైన సంతల అభివృద్దికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసి వారపు సంతలను రూ.5కోట్లతో అభివృధ్ది చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో వెలుగు, గిరిజన సహాకార సంస్ధ, ఎపి ఎస్ ఎస్ డి సి, డివిజినల్ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వారపు సంతలకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని డివిజినల్ పంచాయతీ అధికారిని ఆదేశించారు. వందన్ వికాస కేంద్రాలులో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు అటవీ ఉత్పత్తుల తయారీ, విలువలు జోడించడం వంటి అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసారు. 11 మండలాల్లో 70 వందన్ వికాస కేంద్రాలు ఉన్నాయని 54 కేంద్రాలకు నిధులు విడుదల చేసామని చెప్పారు. మిగిలిన 16 కేంద్రాలకు త్వరలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు, కొండచీపుర్లు, అడ్డాకులకు అదనపు విలువలను జోడిస్తే మార్కెట్‌లో మంచి ధరలకు విక్రయించ వచ్చాని చెప్పారు. విడివికె లో ఉన్న సంఘాల సభ్యులకు తగిన శిక్షణ అందిస్తే 15 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.శిక్షణకు అవసరమైన షెడ్యూలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు, జిసిసి డివిజినల్ మేనేజర్ కె.పార్వతమ్మ , ప్రోగ్రాం అసోసియేట్ విజయకుమార్ , ఎపి ఎస్ ఎస్ డిసి మేనేజర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు.