హాజరు లేని వాలంటీర్లను తీసేయండి


Ens Balu
6
Gurla
2022-05-16 11:50:48

హాజరు సక్రమంగా లేని వలంటీర్లపై జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి  ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సక్రమంగా విధుల‌కు హాజ‌రుకాని వలంటీర్లను తొలగించాలని ఆదేశించారు.  విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని  సత్యనారాయణపురం వార్డు సచివాలయాన్ని, గుర్ల మండలం జమ్ము సచివాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స్పంద‌న విన‌తులుపై ఆరా తీశారు. స‌చివాల‌య ప‌రిధిలో వివిధ ప‌థ‌కాల అమ‌లును తెలుసుకున్నారు.  జ‌గ‌నన్న ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు.  మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని, ముందుకురాని ల‌బ్దిదారుల ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. ఓటిఎస్ ప‌థ‌కంపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. రిజిష్ట్రేష‌న్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు రుణాలను ఇప్పించాలని సూచించారు. పిల్ల‌ల‌కు, గ‌ర్భిణిల‌కు ర‌క్త ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆరా తీశారు. హెమోగ్లోబిన్ శాతం చాలా త‌క్కువ‌గా ఉన్న‌వారిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టి, పోష‌కాహారాన్ని అందించాల‌ని సూచించారు. ముఖ్యంగా నెల‌నెలా పంపిణీ చేస్తున్న‌ రేష‌న్ బియ్యాన్ని వినియోగించ‌డం ద్వారా, ర‌క్త‌హీన‌త‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని అన్నారు. జమ్ము గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రామంలో రు.35 లక్షలతో ప్రతిపాదించిన జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. చదువుకొనే పిల్లలందరూ బడులకు, కళాశాలలకు వచ్చేటట్టు చూడాలని, డ్రాపౌట్ల పై దృష్టి పెట్టాలని కలెక్టర్ కొరారు. ఈ పర్యటనలో ఆయా మండలాల తాసిల్డార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.
సిఫార్సు