వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజలతో సఖ్యతగా మెలగాలని, సంతృప్తికర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సూచించారు. నెల్లిమర్ల మండల పరిధిలోని జరజాపుపేట -1, 2 సచివాలయాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రగతి నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సచివాలయ సిబ్బందికి, ఇతర అధికారులకు మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఓటిఎస్ పైన మరొక్కసారి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. లే ఔట్ కి అప్రోచ్ రోడ్డు నిర్మించాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
ఆమె వెంట నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్. రామారావు, పంచాయతీ రాజ్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లు, ఆశాలు తదితరులు ఉన్నారు.