కన్నతల్లి లాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, దాని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపకులపతి పివిజిఆర్ ప్రసాద్ రెడ్డిల మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని ఏయు జెఏసి నేతలు ద్వజమెత్తారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి నాయకులు, అధ్యాపకులు, అనుబంధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన జ్వాల రగిలించారు. రోడ్లను నిర్బంధించి రెండు నిమిషాల పాటు మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మతిభ్రమించి మాట్లాడుతున్న అయ్యన్న వ్యాఖ్యలు ట్విట్టర్ లో పోస్టులు చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఖ్యాతిని అవమానపరిస్తే సహించేది లేదన్నారు. ప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత ఏయు మరింత అభివృద్ధికి నోచుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ టాప్ టెన్ లో ఉంచాలన్న ఆకాంక్షను ఉపకులపతి పివిజిఆర్ ప్రసాద్ రెడ్డి ముందుకు తీసుకెళ్తూ నాడు నేడు పేరుతో విద్యార్థుల మౌలిక వసతి కల్పన, నూతన భవన నిర్మాణాలు, చే పడుతున్నారన్నారు. దానిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఏయూ ప్రతిష్టను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని, తక్షణమే అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సిపి స్టూడెంట్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బి కాంతారావు, ప్రొఫెసర్స్ టి శారున్ రాజు, ఎన్ ఎ డి పాల్, ఏయూ ఉద్యోగ సంఘాల నాయకులు జీ రవి కుమార్, రమణారెడ్డి, స్టూడెంట్స్ లీడర్స్ ఎం కళ్యాణ్, పూడి చరణ్, హేమచంద్ర , తుల్లి చంద్రశేఖర్, పితాని ప్రసాద్ , పవణ్ తదితరులు పాల్గొన్నారు.