ప్రజలు సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడం, ప్రజలను సమీకరించడం, సమస్యలు పరిష్కారమయ్యే వరకు కృషి చేసే లక్ష్యంతో ‘జనం కోసం ఇంటింటికి సిపిఎం కార్యక్రమం’చేపట్టిందని, దానికి విశేష స్పంద వచ్చిందని నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఆదాయాలు తక్కువ, భారాలు ఎక్కువ. బ్రతుకు భారంగా వుంది. మా సమస్యలు పరిష్కారం కావాలి అంటూ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11 ఉ.10గం.ల.కు కలెక్టరు ఆఫీస్ వద్ద మహా ధర్నా జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యల ధరకాస్తులతో పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి రావాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో ప్రజలపై పెద్ద ఎత్తున పన్నులు, ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతీ సేవకు యూజర్ ఛార్జీల పేరుతో ధరలు భారాలు వేస్తోంది. విద్యుత్‌ను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు.ఈ దుష్ట విధానాలను జగన్ ప్రభుత్వం ఎదిరించడం లేదు సరి కదా! అన్ని రాష్ట్రాల కన్నా ముందే మన రాష్ట్రంలో అమలు చేస్తోంది. అధికార పార్టీతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా కేంద్రంతో పోరాడాలన్నారు. మన రాష్ట్రానికి రావల్సిన నిధులు, హక్కులు రాబట్టాలి. కానీ వీరెవ్వరూ కేంద్ర బిజెపిని నిలదీసేందుకు సిద్ధపడడం లేదు. ప్రజల ప్రయోజనాల కన్నా తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బిజెపికి ఇది ఒక వరంగా మారింది. కనుకనే రోజు రోజుకీ ప్రజలపై భారాలు, సమస్యలు తీవ్రమౌతున్నాయి. కష్టాల్లో వున్న ప్రజలకు అండగా నిలిచేందుకు సిపిఎం పార్టీ నిబద్దతతో కృషి చేస్తోందని చెప్పారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా వుంటుందన్నారు.