ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి పల్లెలోనూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.మంగళవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఏపీఈపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, డి ఈ,ఏ ఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సీఎం తీసుకున్న పలు సంస్కరణల వలన విద్యుత్ రంగం పురోగతిలో పయనిస్తోందన్నారు.పలుచోట్ల విద్యుత్ కూడా ఆదా అవుతుందన్నారు.. గ్రామాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టడం వలన గణనీయంగా విద్యుత్ ఆదా అవుతుందన్నారు. గత మూడేళ్లుగా విద్యుత్ మీటర్ల సంఖ్య, వినియోగం అంశాలు పరిశీలిస్తే విద్యుత్ రంగం ప్రగతి బాటలో ఉందన్న విషయం తేటతెల్లం అయింది అన్నారు.రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్ డిమాండ్,సప్లై,పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు తదితర విషయంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.సెకి తో ఒప్పందం మూలంగా సుమారు 45 మిలియన్ల యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులోకి వస్తుందని స్పీకర్ తమ్మినేని తెలిపారు.హైడ్రో ప్రాజెక్టు అంశంపై కూడా సీఎం దృష్టి సారించారన్నారు.పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు,విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతులన్నారు.రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు.ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో తాను పాల్గొన్నప్పుడు పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యల ప్రజల నుండి వినతులు వచ్చాయన్నారు. వాటిని విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు.వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో వేలాడుతున్న వైర్లు,మరమ్మతులకు నోచుకోని ట్రాన్స్ఫార్మర్లు,అవసరమైన చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాట్లు, కొన్ని చోట్ల లైన్ మెన్లు కొరత వంటివాటిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ఆమదాలవలస మండలం తాళ్లవలస గ్రామంలో 400kv ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే,వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు.ప్రతి గ్రామంలోనూ విద్యుత్ సమస్యలు ఉంటే తక్షణం మరమ్మతులు చేసి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు.రైతులకు కరెంటు సప్లై విషయంలో అంతరాయం కల్పించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగునీరు అందుబాటులో ఉన్న చోట సోలార్ పంప్ సెట్ లు ద్వారా రైతులకు సాగు పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సోలార్ పంపుసెట్ల కొనుగోలు వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు.
ఉచిత విద్యుత్ బిల్లులను రైతులు ఖాతాల్లోకే జమ చేసి వారి ద్వారానే చెల్లించే ఏర్పాట్లు చేసేలా సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతారని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు శాఖ కూడా ప్రజలు, రైతులనుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాస పెట్టాలన్నారు.ఈ మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన విషయాన్ని స్పీకర్ గుర్తుచేశారు.ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చిన చోట రైతుల ఖాతాల నుంచి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. సంస్కరణల వల్ల,రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని,రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని, ఈ విషయంలో సీఎం ముందు చూపు తో వ్యవహరించారన్నారు.ఇక వైయస్సార్ జలకళను పారదర్శకంగా అమలు చేయాలని స్పీకర్ సూచించారు. మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పామని.., కానీ మోటారు ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం అన్నారు.అనూహ్య డిమాండ్ ఉన్న సమయాల్లోనూ మిగులు విద్యుత్తు ఉండేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ దైవప్రసాద్, డీ ఈ పైడి మహేషేశ్వరారావు, డీ ఈ ఈ డి.రాంబాబు, ఏ ఈ లు రామారావు,వెంకటప్పలనాయుడు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.