విద్యార్ధులకు జీవిత జ్ఞానాన్ని కూడా నేర్పండి


Ens Balu
8
Badangi
2022-07-05 11:44:57

విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో బాటు, జీవిత జ్ఞానాన్ని కూడా పంచాలని, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ చదువుకొనే విధంగా ప్రోత్సహించాలని, ఏ ఒక్క విద్యార్థీ, ఏ కారణం చేతా చదువుకు దూరం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.  బాడంగి జిల్లాపరిషత్ పాటశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ  కార్యక్రమం, సమగ్ర శిక్ష  ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. జిల్లాలోని 1,70,232 మందికి రూ. 33,43,35,648 విలువైన విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. అంతకు ముందు కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగనోహన రెడ్డి ప్రారంభించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా  ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో బాటు, జీవితానికి సంభందించిన ఇతర అంశాల పట్ల కూడా అవగాహన కల్గించి, అర్థవంతమైన జీవనాన్ని అలవాటు చేయాలని సూచించారు. బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా చదువుకొనేటట్లు చూడాలని కోరారు. వివిధ కారణాలవల్ల మధ్యలో బడి మానేసిన వారి చదువును ఏదో ఒక రూపంలో కొనసాగేలా చూడాలని సూచించారు. కొవిడ్ కారణంగా చదువు దెబ్బతిందని, ప్రాథమిక పాటశాలల విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి, గత పాఠాలను పునచ్చరణ చేయించాల్సిన అవసరం వుందన్నారు.  ఆడపిల్లలు కూడా, చదువును పూర్తి చేసి, ఆర్థికంగా తమ కాళ్ళమీద నిలబడే వరకు వివాహం చేసుకోకూడదని సూచించారు. 

ఇటీవల కాలంలో చదువుకొనే వారి సంఖ్య బాగా పెరిగిందని, ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం అభినందనీయమని అన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఇంటర్లో ఉన్న విద్యావకాశాలపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఇంటర్ హెచ్ఈసి, సిఈసి గ్రూపుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని కలెక్టర్ చెప్పారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కేరళ కు ధీటైన విద్యావ్యవస్థను ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాటశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్ళారని కొనియాడారు. ఒక్కో విద్యార్థికి రూ.1964 విలువైన అత్యంత నాణ్యమైన 8 రకాల వస్తువులతో విద్యా కానుకను అందించడం జరుగుతుందని చెప్పారు. త్వరలో 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను ఉచితంగా ట్యాబ్ లను అందజేయనున్నట్లు తెలిపారు.  సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పల నాయుడు మాట్లాడుతూ, విద్య కోసం ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు వినియోగించుకొని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేజిబివి సెక్రటరీ నాగమణి, డీఈవో డాక్టర్ జయశ్రీ, సమగ్ర శిక్ష ఏపిసి డాక్టర్ స్వామి నాయుడు, జెడ్పీటీసీ పెద్దింటి రామారావు, ఎంపిపి బి. గౌరి, ఎంపీడీఓ బి.అక్కారావు, తాసిల్డార్ బాలమురళి కృష్ణ, ఎంఈఓ జి.కృష్ణమూర్తి, హెచ్ఎం  ఎస్ త్రినాధరావు, సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు