వర్మీ కంపోస్ట్ కేంద్రాలను ఆదాయ వనరుగా మరింత అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కొవ్వూరు మండలం ఐ.పంగిడి లో ఎస్ డబ్ల్యు పి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత కేంద్రంలో ఉన్న సిబ్బందితో ముఖాముఖి సంభాషించడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి అవుతున్న వర్మి కంపోస్ట్, తదుపరి ఆ మొత్తం మార్కెటింగ్ చేసే విధానం పై వివరాలు అడిగారు. ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు వంటి వివరాలు అడగడం జరిగింది. అనంతరం అధికారులకు సూచనలు చేస్తూ ఘనవ్యర్ధల సంపద సృష్టి కేంద్రాలను మంచి ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాలన్నారు. అంతే కాకుండా వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవ్వూరు మునిసిపాలిటీ ప్రాంతంలో ఇటీవల డంపింగ్ తొలగించిన ప్రాంతంలో కూడా ఎస్ డబ్ల్యు పి కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్ని గ్రామాలలో పరిశుభ్రత పాటించడం లో భాగంగా సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ల (SWPC) ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని కలెక్టర్ మాధవీలత తెలిపారు.ప్రతి ఒక్క పౌరుడు తన సామాజిక బాధ్యతగా తడి చెత్త, పొడి చెత్త ఇంటింటికీ చెత్త సేకరణ కోసం వొచ్చే వారికి అందించాలన్నారు. అందువల్ల సులువుగా తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం సాధ్యం అవుతుందన్నారు. రెండు రకాలు కలపడం వల్ల తిరిగి చెత్తను విడదీసి చెయ్యాల్సి ఉంటుందని , ఇది ఎంతో శ్రమతో కూడి, మానవ వనరుల వృధా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీ చెత్త సేకరణ రిక్షలను దశల వారీగా పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్ది జిల్లాను ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు. తొలుత వర్మి కంపోస్ట్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివళులర్పించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డ్వామా పీడీ పి. జగదాంబ, సర్పంచ్ గోసాల నాగార్జున, సిబ్బంది పాల్గొన్నారు.