సచివాలయ పరీక్షలు విజయవంతం చేయాలి..
Ens Balu
4
Narsipatnam
2020-09-19 18:44:17
గ్రామ , వార్డు సచివాలయ రాత పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా , పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రెండు పూట్ల నిర్వహించనున్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం డివిజన్ పరిధిలోగల సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు , సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాత పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి మాస్క్ ధరించడం, శానిటైజర్ తప్పనిసరి అన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు రాత పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ప్రత్యేక ఐసోలేషన్ రూము ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి రెండు గంటలు ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించ రాదన్నారు. హాల్ టికెట్ తో పాటు , ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగుల కొరకు ప్రత్యేక ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ నర్సీపట్నం వేములపూడి ఏపీ మోడల్ స్కూల్, పాయకరావుపేట క్లస్టర్ , నక్కపల్లి లలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.