చిన్న కుటుంబం ఉన్ననాడే భావితరాలకు సహజ వనరులను అందించేందుకు వీలుకలుగుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని సంయుక్త కలెక్టర్ ఎం.విజయసునీత అభిప్రాయపడ్డారు. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవ ర్యాలీ కార్యక్రమం స్థానిక డిఎహెచ్ఓ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనకున్న వనరుల్లో అసాధారణమైన వనరు మానవ జనాభా అని, ప్రకృతి విపత్తులను,అనేక అడ్డంకులు,ఆటంకాలను ఎదుర్కొని అప్రహితంగా మనుగడను కొనసాగిస్తుందని ఆమె పేర్కొన్నారు. అసాధారణ రీతిలో జనాభాను పెంచుకుంటూ పోతే ప్రపంచానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. కావున ఎప్పటికపుడు మన ప్రగతిని సమీక్షించుకుంటూ మరింత అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ఈ రోజు ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆమె గుర్తుచేశారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని సమీక్షించుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. 1989సం.లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించగా, నాటి నుండి ప్రతి ఏడాది ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. 1951సం. నుండి మనదేశంలో జన గణన ప్రారంభమైందని, నాటి నుండి 7 సార్లు జనాభా గణన జరిగిందని అన్నారు. గతేడాది జనాభా గణన జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా వేసినట్లు జెసి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8కోట్ల 53 లక్షలు కాగా, ప్రపంచ జనాభా 8 బిలియన్ల వరకు పెరిగిందని అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉందని, అందుకు తగిన విధంగా సహజ వనరులను భేరీజు వేసుకోవాలని ఆమె కోరారు. అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిద్దాం..నూతన అధ్యాయానికి నాంది పలుకుదాం అని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ఆమె ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు.
చిన్న కుటుంబం ఉన్నపుడే భావితరాలకు సహజ వనరులను అందించగలుగు తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు అందించిన డా.జయలక్ష్మి,పి.రేఖలకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున, అగర్త తేజ మరియు బి.భారతిలకు రూ.5వేలు వంతున ప్రోత్సాహక బహుమతితో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన డెప్యూటీ ఎస్.ఓ డి.శ్రీనివాస పట్నాయక్,డా.ఎన్. శేషగిరి, డా.జి.గణపతి,డా.పి.తార తదితరులకు జ్ఞాపికతో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అనంతరం ర్యాలీ ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగగా ఆద్యంతం ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.మీనాక్షి, పైడి వెంకట రమణ,డా.కె.కృష్ణమోహన్,డా.కె.అప్పారావు,డా.ఎన్. షగిరి,డా.జి.గణపతి,డా.పి.తార, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహనరావు, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.వి.ప్రసాదరావు, మేనేజర్ వి.వి.అప్పల నాయుడు, జిల్లా చీఫ్ కోచ్ మాధవీలత, నటుకుల మోహన్, మంత్రి వెంకటస్వామి, సోమేశ్వర రావు, కె.ఎల్.నారాయణరావు, పెంకి చైతన్య కుమార్, సూర్యకళ, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.