కాకినాడలో రూ.30 కోట్లతో నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరు కృతికా శుక్లా.. సాంఘిక సంక్షేమం, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాకినాడ పాత బస్టాండ్ వద్దన్న డా. బి.ఆర్ అంబేద్కర్ భవన్ ను పరిశీలించి అత్యవసర మరమ్మత్తుల పనులు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడలో ఉన్న అంబేద్కర్ భవన్ ను గత రెండు సంవత్సరాలగా కోవిడ్ మెటీరియల్ స్టోర్ చేయడంతో వినియోగం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి కొవిడ్ స్టాక్ ను పూర్తిగా తొలగించామన్నారు. అత్యవసర మరమ్మతులు, ఎయిర్ కండిషన్ కనెక్షన్ ఇతరులకు సంబంధించి రూ.13 లక్షల మంజూరు చేయడం జరిగిందని, సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లును కూడా చెల్లించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు15 నాటికి అత్యవసర మరమ్మతుల పనులు పూర్తిచేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులకు ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 30 కోట్ల రూపాయలతో నూతన అంబేద్కర్ భవనాన్ని ఆధునిక వసతులతో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశాలకు అనుగుణంగా కాకినాడలో నూతన అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జే.రంగలక్ష్మీదేవి, ఏపీఈడబ్ల్యుఐడీసి ఈఈ వి లక్ష్మణ రెడ్డి డీఈ కె.వెంకటరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.