గ్రామ సచివాలయాల్లో ప్రజల నుంచి సర్వీస్ రిక్వెస్టులు పెరిగేలా చూడాలని, అన్ని రకాల సేవలు సులభతర రీతిలో అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆమె మలిచర్ల గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రగతి నివేదికలను, హాజరపట్టీలను పరిశీలించారు. వాలంటీర్ల సేవలు వాటిపై ప్రజల స్పందన గురించి ఆరా తీశారు. జనాభాకు తగ్గట్టుగా ప్రజల నుంచి సర్వీసు రిక్వెస్టులు ఎందుకు రావటం లేదని ప్రశ్నించగా.. చాలా మంది సమీపంలో ఉన్న మీసేవలను ఆశ్రయిస్తున్నారని సిబ్బంది బదులిచ్చారు. సంతృప్తి చెందని కలెక్టర్ సచివాలయం ఉండగా మళ్లా ప్రజలు మీసేవలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, పరిస్థితి మారాలని అన్ని రకాల సేవలూ సచివాలయం ద్వారానే ప్రజలకు అందాలని ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇక్కడ అందే సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలని చెప్పారు. వివిధ రకాల ధృవీకరణ పత్రాలను లామినేషన్ చేయించాలని సూచించారు. అలాగే ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఏఎన్ఎంను ఆదేశించారు. స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్యదర్శకి సూచించారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ల సదుపాయం కూడా ప్రజలకు కల్పించాలని సూచించారు. ఆమె వెంట స్థానిక సర్పంచి, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.