సాగు నీటిని విడుదల చేసిన మంత్రి రాజా
Ens Balu
1
Annavaram
2022-07-12 14:43:00
పంపా నది నీటిని సాగు భూముల సేద్యానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిసెట్టి రాజా మంగళవారం విడుదల చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలోని సత్యదేవుని రత్నగిరిని ఆనుకుని పంపా జలాశయం ఉంది. మెట్ట ప్రాంత రైతాంగానికి వరప్రదాయినిగా ఈ పంపా రిజర్వాయర్ సేవలందిస్తోంది. పంపాలో ప్రస్తుతం 100.90 క్యూసెక్కుల నీరు నిల్వ ఉండగా దీనిలో 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షపు నీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటుందని, అందులో రోజూ 100 క్యూసెక్కుల నీటిని నది గర్భంలో నిలకడగా నిల్వ ఉంచుతూ ఆపై మిగులు జలాలను విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. 105 అడుగుల నీటి సామర్ధ్యం కలిగిన ఈ రిజర్వాయర్ నుంచి తొండంగి, తుని మండలాల్లోని సుమారు 12,000 ఎకరాల ఆయకట్టు సాగు భూములకు నీరు అందుతుంది. రిజర్వాయర్ సామర్ధ్యానికి మూడు సార్లు నీరు నిండితే పూర్తి స్ధాయిలో ఆయకట్టుకు నీరందుతుంది. కాగా ఈ నీటి విడుదల సమయంలో మంత్రి దాడిసెట్టి రాజా వెంట అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.