విమానాశ్రయంలోనికి నీరుచేరకూడదు


Ens Balu
9
Visakhapatnam
2022-07-12 16:13:51

విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం  ఉదయం తన ఛాంబర్‌లో విమానాశ్రయ నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా మేఘాద్రి రిజర్వాయర్ కు  అధిక మొత్తంలో నీరు చేరినందున, అదనపు నీరు విడుదల చేస్తున్న కారణంగా విమానాశ్రయం, పరిసర ప్రాంతాలలోకి నీరు చేరకుండా తక్షణమే  చర్యలు ప్రారంభించాలని అన్నారు. విమాన రాక, పోకలకు , ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.విమానాశ్రయం, ఐఎన్‌ఎస్‌ డేగ, పోర్టు, జివిఎంసి, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమీషనర్   జి.లక్ష్మీషా,  విమానాశ్రయ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, పోర్ట్ ట్రస్ట్ ఎజిఎం, ఐఎన్‌ఎస్‌ డేగ సిబ్బంది ,  జివిఎంసి ,ఇరిగేషన్‌ మొదలగు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు