సింహగిరి ప్రదక్షిణ, ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చేసిన వివిధ రకాల పుష్పాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. సింహాద్రినాధుడు ఆలయంతో పాటు వివిధ దేవతా మూర్తుల ఆలయాలు ను బుధవారం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో ప్రధాన ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులందరికీ కూడా ఆలయ వర్గాలు సంతృప్తికరంగా స్వామి దర్శన భాగ్యం కల్పించడం ప్రశంస నీయమని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. 32 కిలోమీటర్ల పొడవునా కాలినడకన గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్న శ్రీను బాబు దంపతులు బుధవారం సింహాద్రి నాధుడును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించిన తాను చిన్నప్పటి నుంచి కూడా గిరి ప్రదక్షణ చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ విరామం తర్వాత తిరిగి గిరి ప్రదక్షిణ పూర్తిచేయడం స్వామి అనుగ్రహం గా భావిస్తున్నట్లు ఆయన
చెప్పారు. స్వామివారి అనుగ్రహం వల్లే తాను గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలిగానన్నారు. ఏటువంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామని తెలిపారు. కాగా ఆషాడ పౌర్ణమి నేపథ్యంలో సిరులొలికించే సింహాద్రి నాధుడు కి ఆఖరి విడత గా ఈరోజు మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించారు. సాయంత్రం ఆలయ మండపంలో ఢిల్లీ విజయోత్సవాన్ని కూడా ఆలయ అర్చక స్వాములు, అధికారులు ఘనంగా జరిపించారు.