వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి
Ens Balu
7
Sarpavaram Junction
2022-07-14 05:54:37
వర్షాకాలంలో తాగే నీరు కలుషితం అవడం, మురుగు గుంటలో దోమలు వ్యాప్తి చెందడం వల్ల డెంగ్యూ, మెదడువాపు, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రముఖ చర్మవ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ టి సి చంద్రగుప్త పేర్కొన్నారు. కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వర్షాకాలాల్లో వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జ్వరం, ఎముకల నొప్పులు, కళ్ళ నుంచి నీరు కారడం , ఆకలి తగ్గి వాంతులు అయ్యేలా ఉండడం, శరీరం పై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కు నుండి రక్తం కారడం, రక్త విరోచనాలు, తలనొప్పి వంటివి డెంగ్యూ వ్యాధి లక్షణాలని అన్నారు. దీని నివారణకు దోమలకు ఆవాసాలైన నీటి తొట్టెలు, టైర్లు, కుండీల్లో నీరు నిల్వ ఉంచరాదని డాక్టర్ చంద్రగుప్త తెలిపారు. ఎలాంటి వ్యాధులు వచ్చినా సొంత నిర్ణయాలతో మందులు వాడేయకుండా ముందుగా పరీక్షలు చేయించుకున్న తరువాత వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, బాపిరాజు, ఓం నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.