మానవాళి మనుగడకి ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి అని పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. విశాఖపట్నం- భీమిలి బీచ్ రోడ్ లోని మంగమారిపేటలో గల చిన్నజీయర్ స్వామి వేదపాఠశాల ప్రాంగణం (వారిజ ఆశ్రమం) లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా గురువారం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. స్వామి మాట్లాడుతూ సాధారణంగా చాతుర్మాస్య దీక్ష ప్రతి ఒక్కరూ నిర్వహించవచ్చని అయితే ప్రస్తుత కాలానుగుణంగా కేవలం యతీశ్వరులు సన్యాసులు పీఠాధిపతులు మాత్రం తప్పకుండా ఈ దీక్షను ఆచరిస్తున్నారన్నారు. వర్షాకాలం కారణంగా జీవచరాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సంధ్యా సమయం తర్వాత పాదయాత్ర కానీ పర్యటనలు గాని చెయ్యరాదన్నారు. ఆహార నియమాలతో పాటు గ్రంథం పఠనం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో వాతావరణ ప్రభావంతో మనిషి సాధారణ ఆహారాన్నీ తీసుకోలేడని, తిన్న ఆహారం జీర్ణం కావడానికి పరిస్థితి అనుకూలించదన్నారు. ఈ సమయంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు, నిర్ణీత సమయంలోనే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. అలవాటు మారితే ఆలోచనా విధానం కూడా మారుతుందని, తద్వారా మంచి ఆలోచన చేయగలుగుతాడన్నారు. అందుకే ఈ సమయంలో చాతుర్మాస్య దీక్ష
లో సైతం ఒక్కో నెలలో ఒక్క విధమైన ఆహారాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో యాంత్రీక జీవనం వల్ల యువత రాత్రివేళల్లో సరైన నిద్ర లేక, ఉదయం వేళల్లో సరైన ఆహారం లేక చిన్న వయసులోనే పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఉన్న సమయంలోనే ఆహారపు అలవాటును సరిదిద్దుకోవాలని స్వామి సూచించారు.