పారిశుధ్య కార్మికులు గత నాలుగు రోజులుగా సమ్మెలో ఉన్నా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పారిశుధ్య నిర్వహణ చేపడుడున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. గురువారం నగరంలో పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో జగన్నాధపురం లోని ఏటిమొగ, మహాలక్ష్మి నగర్, ముత్తానగర్, సినిమా రోడ్డు ప్రాంతాలలో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుబాటులో ఉన్న పర్మినెంట్ కార్మికులతో పాటు ప్రైవేట్ కార్మికుల సహకారంతో చెత్త సేకరణకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 75% వరకు సమస్య లేకపోయినా కొన్ని నివాసప్రాంతాలు, కమర్షియల్ ఏరియాలలో అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రజలు చెత్తను రోడ్లపైన డ్రైన్ ల లోను వేయకుండా సహకరించాలని ఏ డి సి కోరారు. ఓవైపు వర్షాలు పడుతుండడం, జ్వరాల సీజన్ కావడం వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు వహించకపోతే అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ఇళ్లలోని చెత్తను బయట పార వేయకుండా ఇంటికి వచ్చే హూపర్ టిప్పర్ వాహనాలకు మాత్రమే అందజేయాలని సూచించారు. కార్మికుల సమ్మె పూర్తయ్యే వరకు ప్రజలు కూడా తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు.