సచివాలయాల్లోనూ పన్నులు చెల్లించవచ్చు
Ens Balu
4
Vizianagaram
2022-07-18 11:11:37
వార్డు సచివాలయాల్లో కూడా మున్సిపల్ పన్నులు చెల్లించే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించి, పన్నులు కట్టించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. విజయనగరంలోని పాల్‌నగర్, అయ్యన్నపేట ప్రాంతాల్లో ఉన్న 51,52 వార్డు సచివాలయాలను కలెక్టర్ సూర్యకుమారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ముందుగా ఆయా సచివాలయాల రికార్డులను తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడి, సచివాలయ సిబ్బంది పనితీరును, వారు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. స్పందన వినతులను పరిశీలించారు. సచివాలయాల్లో కూడా మున్సిపల్ పన్నులు వసూలు చేయాలని, రైల్వే టిక్కెట్ బుకింగ్ తదితర సేవలను అందించాలని సూచించారు. ఇంటి ప్లానులకు దరఖాస్తు చేసుకొనే అవకాశం సచివాలయాల్లో కూడా ఉందని, దీనికి ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. ఆయా సచివాలయాల పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, గర్భిణలు, బాలింతల సంఖ్య, వారికి అందిస్తున్న సేవలు, రక్త పరీక్షలు, వేక్సినేషన్, పోషకాహార పంపిణీపై ప్రశ్నించారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. గర్భిణులంతా ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేసేలా వారిని చైతన్య పరచాలని సూచించారు. సఖి గ్రూపులకు నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాలను తెలుసుకున్నారు. స్పోర్ట్స్ క్లబ్లులను ఏర్పాటు చేయాలని సూచించారు. 52వ సచివాలయంలో ఆధార్ సేవలను పరిశీలించారు. ఆయా సచివాలయాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, స్ప్రేయింగ్, చెత్త నిర్వహణ తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సచివాలయాల సమన్వయాధికారి హరీష్ పాల్గొన్నారు.