వృద్ధాప్యంలో వచ్చే కంటి వ్యాధులను నివారించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ తో పాటు కంటి శుక్లాల తొలగింపుకు చర్యలు చేపట్టారని పండురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంటి వైద్యులు డిజి మహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో బోట్ క్లబ్ వాకర్సు సంఘం ఆధ్వర్యంలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నుంచి 60 సంవత్సరాలు నిండిన వారికి మండల పరిధిలో రోజుకు ఒక ప్రాంతంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏఎన్ఎం సిహెచ్. అమ్మాజీ మాట్లాడుతూ వైయస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు సమకూరుస్తున్నట్లు తెలిపారు. కంటికి ఆపరేషన్లు అవసరమైన వారిని ప్రభుత్వాసుపత్రికి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, పట్నాయక్, రాజా, బాపిరాజు, ఆశా కార్యకర్తలు బి. వరలక్ష్మి, జి. నాగలక్ష్మి, పి. సుబ్బలక్ష్మి, జి. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.