తూర్పుగోదావరి జిల్లాలో ఏ ప్రభుత్వ పథకమైనా పొందాలంటే అర్హతే ప్రామాణికం అని ఆ దిశలో లబ్దిదారుల గుర్తింపు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో నవరత్నాలు - ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ , లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఏ కారణం చేతనైనా ప్రభుత్వం అందించే పథకాలు అర్హులకు చేరిఉండకపోతే ద్వై వార్షిక కార్యక్రమంలో భాగంగా అందచెయ్యడం జరుగుతోందన్నారు. వృధ్యాప్య, వితంతు, దివ్యంగుల తదితర పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు పొందకుండా ఉంటే అటువంటి వారి వివరాలు గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది / వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ తిరిగి గుర్తించడం జరుగుతుందన్నారు. ఆ దిశలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందని వారిని ద్వై వార్షిక కార్యక్రమంలో లబ్దిదారుల గుర్తింపు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
వై ఎస్ ఆర్ సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద జిల్లాలో కొత్తగా 12,997 మందిని గుర్తించి మంజూరు చెయ్యడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 479 మందికి సివిల్ సప్లై శాఖ ద్వారా బియ్యం కార్డులను, వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కొత్తగా 1697 మంది తల్లులకు అమ్మఒడి మంజూరు చేశామన్నారు. జిల్లాలో జగనన్న తోడు, వై ఎస్ ఆర్ చేయూత, ఆసరా, సున్న వడ్డీ కింద సుమారు 19 వేలకు పైగా లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సాంకేతిక కారణాల వలన, తదితర కారణాల వల్ల అర్హులకు పథకాలు పొందకుండా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇంకా అర్హులు ఉండి సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, తదితర పథకాలు రాకపోతే సంబంధించి వాలంటీర్ ద్వారా తిరిగి ధరఖాస్తు చేసుకోవాలని మాధవీలత సూచించారు. వారి సమస్యను పరిశీలించి, పరిష్కారం చేసి, ప్రతి ఆరునెలల కి ఒకసారి ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 12997 మందికి వై ఎస్ ఆర్ పెన్షన్ కానుకగా రూ 3,24,92,500/- మెప్మా ద్వారా బ్యాంకు రుణాలు 757 గ్రూపులకు రూ.29,91,796/-, 479 మందికి కొత్త రేషన్ కార్డులు అందచేశారు.