రాజమహేంద్రవరం రూరల్ లోని ధవళేశ్వరం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతాలలోని కుటుంబాలకు వసతి ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ధవళేశ్వరం లోని వాడపేట ఎంపిపి పాఠశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాసితులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఇంటిని తలపించేలా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్వాసితులు వారి ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వచ్చినందున చక్కని ఆహారం, దుప్పట్లు, చక్కని శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వరద బాధితుల ను గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా రూ .2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు 25 కేజీలు బియ్యం, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజి బంగళా దుంప,, ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందచేయాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు మెరుగైన పనితీరు చూపుతున్నారని మాధవీలత పేర్కొన్నారు. వరదల సమయంలో వాలంటీర్లు పనితీరును కలెక్టర్ ప్రశంసించడం జరిగింది. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం, గోదావరి గట్లు తెగిపోకుండా చూడడంలో, సమాచార లోపం రాకుండా అధికారులతో సమన్వయం తో చక్కటి పనితీరు చూపినట్లు పేర్కొన్నారు. నిర్వాసితులతో కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో అందుతున్న సౌకర్యాల పై ఆరా తీసి, వారితో కలిసి కలెక్టర్, రూడా చైర్ పర్సన్ లు భోజనం చేశారు. ఏర్పాట్ల పట్ల నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రంలో ఉన్న నిర్వాసితులకు నిత్యవసర వస్తువులు నగదు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రత్నకుమారి, తదితరులు ఉన్నారు.