పార్టీలకతీతంగా నగరాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె 6వ జోన్ 88 వ వార్డు పరిధిలోని నరవ, కోటనరవ తదితర ప్రాంతాలలో సుమారు 229.67 లక్షల వ్యయంతో పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు, వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసనసభ్యులు, ప్రతీ కార్పొరేటర్ తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో నగరాన్ని సుందర విశాఖ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వార్డులోని ప్రధాన సమస్యలైన త్రాగు నీరు, విద్యుత్తు, పారిశుధ్యం ,రోడ్లు ,కాలువలు, డ్రైన్లు మొదలైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ ఫలాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. రెండు కోట్ల రూపాయలుపైనే అభివృద్ధి కార్యక్రమాలు మన ఒక వార్డ్ లోనే శంకుస్థాపన చేస్తామని, ఇంకా వార్డులో చాలా వరకు పనులు చేయవలసి ఉందని వాటికి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, స్థానిక వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ తో కలిసి సుమారు రూ.1.09 కోటి తొమ్మిది లక్ష రూపాయలు అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి వార్డును ప్రత్యేకంగా దృష్టితో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కొరకు రెండు కోట్ల రూపాయలు కేటాయించారని, వాటిని కూడా అవసరమున్న చోట ఖర్చు పెడతామని తెలిపారు. అనంతరం నరవ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో సర్వ శిక్ష అభియాన్ నిధులతో సుమారు రూ.1.06 కోట్ల వ్యయంతో తొమ్మిది అదనపు తరగతి గదుల నిర్మాణానికి శాసనసభ్యులు, కార్పొరేటర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం, కార్యనిర్వహణ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, సచివాలయం సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.