అమృత్ సరోవర్ పథకం ద్వారా జిల్లాలోని చెరువులు కొత్త రూపు రేఖలు సంతరించుకునేలా చేస్తామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామంలోని త్రాగునీటి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని చెరువులను అమృత్ సరోవర్ పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వీటిలో భాగంగా ఉపాధి నిధులతో కొత్త చెరువుల నిర్మాణాలు, పాత చెరువుల అభివృద్ధి, జంగిల్ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం వంటి పనులను ఉపాధి కూలీల ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమృత సరోవర్ పథకం కింద 75 చెరువులను ఎంపిక చేయగా 39 చెరువుల పనులను చేపట్టి రెండు చెరువు పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. తణుకులో కొత్త చెరువు త్రవ్వకం పనులకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
వీరవాసరం త్రాగునీటి చెరువు గట్టులను పట్టిష్టం చేసి, మొక్కలు నాటి, చెరువు చుట్టుపక్కలంతా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి రాజేశ్వరరావు, ఏపీడి జె.కనకదుర్గలకు సూచించారు. 'హార్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా జెండా పండుగ కార్యక్రమాన్ని ఈ ప్రదేశంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డ్వామా పిడి రాజేశ్వరరావు, ఏపీడి జె.కనకదుర్గ, తహసిల్దార్ ఎం.సుందర్ రాజు, ఇంచార్జ్ ఎంపీడీవో పి.శామ్యూల్, రెవిన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.