ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు


Ens Balu
8
Guntur
2022-08-15 07:11:07

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మార్గదర్శకాలు రెడీచేసే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగుల శాఖ కొత్తది కావడం.. సుమారు 19 శాఖల ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూడా ఇపుడు బదిలీల విషయంలో ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉత్పన్నమవుతున్నది. దానిని అధిగమించడం కోసం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖల ఉద్యోగులకు సంబంధించిన మాత్రుశాఖల్లో అమలు జరుగుతున్న సర్వీసు నిబంధనలు అమలు చేయాలా, లేదంటే అందరు ఉద్యోగులకు సంబంధించినంతవరకూ కొత్త శాఖ కావడంతో వాటికి ప్రత్యేకంగా నిబంధనలు, పదోన్నతుల చార్టు ఏర్పాటు ఏర్పాటు చేయాలా అనే మీమాంశలో ప్రభుత్వం పడినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం సచివాలయ శాఖ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే మూడేళ్లు పూర్తవుతుంది. అందులోనూ చాలా వరకూ ఉద్యోగాల భర్తీ స్థానికత ఆధారంగానే జరిపినా.. కొందరికి మాత్రం పక్కజిల్లాల్లో పోస్టింగులు ఇచ్చారు. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేసే విషయంలో పాత జిల్లాశాఖల నిబంధనలు అమలు చేస్తారా..లేదంటే  అంతర్ జిల్లాల బదిలీల కోసం కొత్త నిబంధనలు తెరపైకి తీసుకు వస్తారా అనే విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.


బదిలీలు  ఏ విధంగా జరుగుతాయో..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులకు సంబంధించినంత వరకూ స్థానికత ఆధారంగా సచివాలయాల్లో పోస్టింగులు ఇచ్చారు. ప్రస్తుతం వాటి ఆధారంగానే జిల్లా పరిధిలో అయితే రోస్టర్ విధానంలో బదిలీలు చేయాల్సి వుంటుంది. అదే రోస్టర్ లో ఎంత శాతం మేర బదిలీలు చేస్తారు. ఇందులో మహిళలు, పురుషులకు ఎంత పర్శంటేజిలో బదిలీలు చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఒక వేళ మొత్తంగా బదిలీలు చేపట్టినా కదిలి పోవడానికి సచివాలయ సిబ్బంది మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి బదిలీలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేయడంతో సాధ్యమైనంత త్వరగా అంటే డిసెంబరు లోగా బదిలీలకు సంబంధించిన జీఓ విడుదల చేయడానికి రాష్ట్ర సచివాలయశాఖ అధికారులు కరసత్తు చేపట్టారు. అంతేకాకుండా ఎంత మంది సిబ్బందికి ప్రస్తుతం రెండేళ్లు పూర్తి చేసుకొని సర్వీసు రెగ్యులర్ అయ్యింది.. ఇంకా ఎంతమందికి కావాల్సి వుంది..డిసెంబరు లోగా ఇంకా ఎంత మందికి సర్వీస్ ప్రొబేషన్ పూర్తికాదు..అందులో మెటర్నటీ సెలవులు తీసుకున్నవారెంతమంది. తదితర వివరాలతో కూడా జాబితా కూడా సేకరించే పనిలో పడ్డారు రాష్ట్ర అధికారులు. ఇటు జాబితా.. అటు బదిలీల నిబంధనలు పూర్తయితే జీఓ జారీకి మార్గం సుగమం అవుతుంది.

ఉద్యోగుల అభిప్రాయ సేకరణకు వెబ్ సైట్..
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో భాగంగానే ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లాల వారీగా అన్ని శాఖలకు సంబంధించి ఎంత మంది ఉద్యోగులు బదిలీలకు ముందుకొస్తున్నారు..ఎంతమందికి కోరుకోవడం లేదనే సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అభిప్రాయాలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రత్యేకంగా జీఓ జారీ చేసి ఆపై బదిలీలకు డిఎస్సీ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే సుమారు మూడు నుంచి ఐదు నెలలు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం విధినిర్వహణలో వున్న లక్షా 21 వేల మంది ఉద్యోగులకు సంబంధించి మొత్తం సర్వీస్ ప్రొబేషన్ పూర్తయిన తరువాత బదిలీలు చేపడితే అందరికీ న్యాయం చేసినట్టుగా వుంటుందనే కోణంలో అధికారులు ప్రభుత్వానికి, మంత్రులకు తెలియజేయగా వారంతా అంగీకరించారని సమాచారం. దీనితో ఈ అంశం ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈసీ నిబందన కూడా తోడయ్యే అవకాశం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ఎన్నిక కమిషన్ ఆదేశాలు కూడా తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో గ్రామస్థాయిలో సిబ్బందిని మార్చకపోతే ఉద్యోగులు ప్రజలను వివిధ సంక్షేమ పథకాల విషయంలో ప్రభావితం చేసే అవకాశాలపై ఈసీ కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం వుంటుంది. అలా ఎన్నికల సంఘాలనికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే సచివాలయ సిబ్బందికి బదిలీలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, సచివాలయాల పరిధిలో సిబ్బంది మొత్తం కొత్తవారే విధుల్లోకి చేరుతారు. తద్వారా అక్కడి ప్రజలను ఏ విషయంలోనూ ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వశాఖల్లో ఎప్పుడు బదిలీలు జరిగినా..అవి ఎన్నికలకు ముందు జరిగితే వాటిని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడే ప్రభుత్వాలు చేపడతాయి. అలా సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు అమలు జరిగినా జరవచ్చుననే సంకేతాలు కూడా ఉద్యోగుల్లోకి వెళుతున్నాయి.


అంతర్ జిల్లాల బదిలీల్లో మరో కొత్త మెలిక..
ఆంధప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో సాధారణ బదిలీలతోపాటు, అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. ఒక వేళ రెండికీ జీఓ విడుదల చేస్తే.. పక్క జిల్లాల బదిలీలు కోరుకునేవారు లాస్ ఆఫ్ సర్వీసు నిబంధనకు అంగీకరించాల్సి వుంటుందా అంటే అవుననే వాదనే బలంగా వినిపిస్తుంది. ఆ విధంగా జరిగితే స్థానిక జిల్లాలో ఉన్న సర్వీసు మొత్తం రద్దై..కొత్త గా బదిలీ జరిగిన జిల్లాలో సర్వీసు మొదలవుతుంది. ఆ విధంగా జరిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడేళ్లో, లేదంటే ఎనిమిదేళ్లకో జరిగి పదోన్నతుల విషయంలో ఇలా లాఫ్ సర్వీస్ కోల్పోయిన ఉద్యోగులు పదోన్నతులు కూడా కోల్పోతారు. ప్రభుత్వం ఆవిధంగా బదిలీలు చేపడుతుందా..లేదంటే మ్యూచ్ వల్ విధానంలో బదిలీలు చేపడుతుందా.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్న ద్రుష్ట్యా అందరికీ ఒకే నిబంధన అమలు చేసి బదిలీలు చేస్తుందా..? అనేవిషయంలో క్లారిటీ రావాల్సి వుంది. ఏది ఏమైనా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో అతి తక్కువ సమయంలోనే అంటే మూడేళ్లకే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పచ్చజెండా ఊపడం..దానికి అనుగుణంగానే పనులన్నీ చకా చకా జరిగిపోవడం నేడు రాష్ట్ర వ్యాప్తం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ చర్చనీయాంశం అవుతోంది..!