ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేడి ఈసారి సీపీఎస్ రద్దుతోనే మొదలయే దాని ప్రభావంతోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి మడమ తిప్పేసిన ప్రభుత్వ తీరుతో ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా.. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తమకి అనుకూలంగా మాత్రమే అడుగులు వేసుకుంటూ వస్తోంది. దీనితో ఆగ్రహంతో వున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. ఇప్పటికే రివర్స్ పీఆర్సీతో తీవ్ర ఆగ్రహంతో వున్న ఉద్యోగులకు ఇపుడు సీపీఎస్ రద్దు కూడా ఒక ప్రత్యేక ఛాలెంజ్ గా మారింది. ఎలాగైనా సీపీఎస్ రద్దు చేసే పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోగా..తాము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సీపీఎస్ రద్దు చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. రద్దు చేస్తామన్న వైఎస్సార్సీపీ మాత్రం పీఆర్సీ అమలు చేసినట్టుగానే సీపీఎస్ రద్దు విషయంలో కూడా రివర్స్ గేర్ లోనే రావాలని చూస్తోందని ఉద్యోగులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేసి మమ అనిపించుకోవాలనే లక్ష్యంతో ఇటు ప్రభుత్వం సీపీఎస్ విషయంలో మరోసారి రాజకీయం చేసి దానిని వచ్చే 2024 ఎన్నికల బూచీగా చూపించే ప్రయత్నాలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్దం చేస్తోందనే ప్రచారం జరుగా సాగుతోంది.
సీపీఎస్ రద్దు విషయంలో తగ్గేదేలేదు..
స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధి విధానాలన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చవి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి అసలు ప్రభుత్వాలు రాజకీయం చేస్తే ఎలా వుంటుందనే అంశం చాలా స్పష్టంగా అర్ధమైంది. ఈ విషయంలో సమ్మెలు, పెన్ డౌన్ లు కాకుండా ప్రభుత్వశాఖలు, ఉద్యోగ సంఘాల వారీగా ఒకే తాటిపైకి వచ్చి ప్రధాన డిమాండ్ల సాధన చేసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల మనుగడ కష్టమనే నిర్ణయానికి ఉద్యోగులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. చేస్తున్న ఆందోళన బయటకు తెలియనీయకుండా సీపీఎస్ రద్దు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తే తప్పా ఏ రాజీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యూహాత్మంగా అడుగులు వేయాలని చూస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా విభజించు పాలించు అన్న సూత్రాన్ని పాటిస్తూ.. ఉద్యోగ సంఘాలను అనుకూలంగా చేసుకొని ఆడిస్తున్న విషయాన్ని ఇటు ఉద్యోగులు కూడా గుర్తించి తమన పని తాము చాపకింద నీరులా చేసుకు పోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నవేళ ఉద్యోగుల తమ స్వరం పెంచడంతోపాటు, ఎన్నికల కార్యాచరణ కూడా ఈసారి చాలా గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎలా పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం 2024 ఎన్నికల్లో చూపించాలని కంకణం కట్టుకున్నాయని చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఏపీ ప్రత్యేకంగా..
సీపీఎస్ రద్దు విషయంలో ఇప్పటికే అమలు చేసిన రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు మాదిరిగా కాకుండా..ప్రభుత్వానికి కలిసొచ్చే విధంగా సీపీఎస్ రద్దు విషయంలో సమూల మార్పులు చేయాలని ఇటు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల్లో అధ్యయనాలు కూడా చేయించి..అక్కడ రద్దు చేసినట్టుగా కాకుండా సీపీఎస్ రద్దులో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ మార్కు కనిపించేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనపిస్తోందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. పీఆర్సీ విషయంలో ఏ విధంగా అయితే జీతాలు పెంచినట్టుగా ఏ విధంగా అయితే కాగితాలపై లెక్కలు చూపించి.. ముందుగానే హెచ్ఆర్ఏ, డీఏ శ్లాబుల్లో కోతలు విధించి.. ఆ పై పీఆర్సీ అమలు చేసి.. అదే మొత్తం పెరిగినట్టుగా చూపిచిందో..ఆ విధంగానే ఇపుడు సీపీఎస్ రద్దు కూడా చేస్తే..ఇచ్చిన హామీ అమలు చేసినట్టుగా అవుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నదని..ఉద్యోగ సంఘాలు తమ సమాజిక మాద్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా ఏ విధంగా రహస్య అధ్యయనాలు, కార్యాచరణ చేస్తున్నదో ఆ విషయాలన్నీ మొత్తంగా ముందే తెలుసుకొని ఉద్యోగ సంఘాలు 2024 ఎన్నికలకు సిద్దం కావాలనే సంకేతాలను కూడా పంపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్ని సమయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఏ పనైనా చేసుకుంటే..ఇక ఉద్యోగులు, అధికారులు ఉన్నది ఎందుకనే అంశాన్ని తెరపైకీ తీసుకువచ్చారు.
తేడా సీపీఎస్ రద్దును ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీల అమలు ఇప్పటి వరకూ కాస్త తేడాగానే అమలు చేసిన ప్రభుత్వం అదేవిధంగా సీపీఎస్ రద్దు కూడా తేడాగానే చేయాలని చూస్తే దానిని నమ్మకుండా తమ తీర్పు అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా చూపించాలనే నిర్ణయాయినికి ఉద్యోగులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా రెండేళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అధనంగా 9నెలలు కేవలం రూ.15వేలకే ఉద్యోగాలు చేయించి, ఆ పై పీఆర్సీ బెనిఫిట్స్ ఇవ్వకుండా చేతులు దులుపుకున్న వైనాన్ని కూడా ఉద్యోగ సంఘాలు ఎన్జీఓల ద్వారా అందరిలోనూ చైతన్యం కల్పిస్తున్నాయి. ఇదే పద్దతి కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుకున్న విధానాలనే అమలు చేస్తుంది తప్పితే ఉద్యోగుల డిమాండ్లలన్నీ అలానే ఉండిపోతాయని.. మనుగడ కూడా ప్రశ్నార్ధకం అవుతుందని.. దానికోసం సమూహంగా ఉద్యోగుల భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు చరిత్ర కావాలనే లక్ష్యంతో పనిచేయాలని హిత బోద చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తేడాగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగుల పవర్ ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామనే సంకేతాలు కూడా అపుడే విడుదల చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.
సీపీఎస్ విషయంలో సామ, వేద, దండోపాయాలు..
సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగుల విషయంలో సామ, వేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్న ప్రభుత్వం ఇదే పద్దతిని కొనసాగించి 2024 ఎన్నికల్లో మరోసారి ఉద్యోగులను నమ్మించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు వారి వారి కూటముల్లో పెద్ద ఎత్తున ప్రాచారానికి తెరలేపారు. ఈ విషయంలో ఉద్యోగులంతా కలిసికట్టుగా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టపోతామనే విషయాన్ని, ఏ విధంగా నష్టం జరుగుతుంది..పీఆర్సీ విషయంలో ఇపుడు జరిగిన నష్టాన్ని గ్రాఫ్ లు గా వేసి మరీ ప్రచారం చేస్తున్నారు ఉద్యోగులు. ఈ విషయం ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లినా తాడో పేడో అన్నట్టుగా ఉండటంతో.. ప్రభుత్వ ఉద్యోగులను సీపీఎస్ రద్దు అంశం తోనే బురిడీలను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సీపీఎస్ రద్దు విషయంలో కొత్తగా అధ్యయనాలు చేసి.. సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో మాదిరిగా కాకుండా.. ప్రభుత్వం అనుకున్న విధంగా విధి విధానాలు ఖరారు చేయడానికి ప్రభుత్వం చూస్తోందని మీడియా సైతం కోడై కూస్తోంది. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రచారం చేస్తూనే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను, ఉద్యోగులను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడంలో పై చేయి సాధిస్తున్నది ప్రభుత్వం. అయితే అన్నింటినీ నిసితంగా పరిశీలిస్తున్న ఉద్యోగులు, మొన్నటి వరకూ ఉద్యోగ సంఘాల్లో మాత్రమే చైతన్యం తీసుకు వచ్చి..నేడు ప్రజలను కూడా చైతన్య పరిచే కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ఎక్కడైనా జన సమ్మర్ధం ఉన్నచోట ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చేస్తున్న వ్యవహారాలను పనిగట్టుకొని ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. ప్రభుత్వం ఒకలా ఆలోచిస్తుంటే..దానికి రెండు రెట్లు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘాలు ముందుంటున్నాయి. మొత్తానికి సీపీఎస్ రద్దు విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న వ్యవహారం 2024 ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపించే విధంగా అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వ కార్యాచరణ దెబ్బా దెబ్బగా ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతున్నది. చూడాలి ఏం జరుగుతుందనేది..!