ప్ర‌తి రైతు ఇ-క్రాప్ న‌మోదు చేయించుకోవాలి


Ens Balu
8
Cheepurupalli
2022-08-16 13:18:13

ప్రతి రైతు తన పంటను ఇ.క్రాప్ లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఈ -క్రాప్ నమోదు చేయించుకోనందువల్ల రైతులు ఎంతో నష్టపోతారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టానికి గురైనా, పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందాలన్నా ఈ. క్రాప్ నమోదు అవసరమనీ చెప్పారు. చీపురుపల్లి మండలంలో మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. కరకాం లో రూ.40 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని, రూ.23 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పి.కె.పాలవలస పంచాయితీ బైరెడ్డి పేటలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తదితరులతో కలసి మంత్రి కరకాంలో గ్రామసభ నిర్వహించి గ్రామంలో సచివాలయం ద్వారా అందుతున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన గ్రామసభలో సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. రేషన్ కార్డులో చనిపోయిన భర్త పేరు తొలగించి వితంతువులకు వచ్చే జనవరి నుంచి ఫించన్ మంజూరు చేయాలని గ్రామ కార్యదర్శికి ఆదేశించారు.

గ్రామంలో ఏ.ఎన్.ఎం. ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడి కేంద్రం ద్వారా పోషకాహారం అందుతున్న తీరుపై ఆరా తీశారు. మహిళా పోలీస్ వ్యవస్థను గ్రామ స్ధాయిలో ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకే ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. క‌ర‌కాంలో టీచ‌ర్లు స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డం లేద‌ని పేర్కొంటూ ప‌లువురు గ్రామ‌స్థులు విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఫిర్యాదు చేశారు. ముగ్గురు టీచ‌ర్లు సరిగా ప‌నిచేయ‌ని కార‌ణంగా ఈ ఏడాది 30 మంది ఇక్క‌డి పాఠ‌శాల నుంచి వేరేచోటికి మారిపోయారని తెలిపారు. దీనిపై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ ఆ ఉపాధ్యాయుల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల‌ని మండ‌ల విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

స‌చివాల‌యం ద్వారా క‌ల్పిస్తున్న సేవ‌ల‌ను గ్రామ‌స్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు. గ్రామాల్లో వెల్ నెస్ సెంట‌ర్‌లు కూడా త్వ‌ర‌లోనే ఏర్పాట‌వుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఇక‌పై గ్రామ‌స్థాయిలోనే స‌చివాల‌యంలో వైద్య సేవ‌లు అంద‌నున్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకొని తల్లిదండ్రులంతా త‌మ పిల్ల‌ల‌ను బాగా చ‌దివించాల‌ని కోరారు. స‌చివాల‌య సిబ్బందికి గ్రామ ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రించి వారు కోరిన స‌మాచారం అందించాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని త‌మ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ఎం.పి.పి. ఇప్పిలి వెంక‌ట‌న‌ర‌స‌మ్మ‌, జెడ్పీటీసీ వ‌లిరెడ్డి శిరీష‌, గ్రామ స‌ర్పంచ్ జ‌మ్ము సావిత్రి, చీపురుప‌ల్లి ఆర్‌.డి.ఓ. అప్పారావు, జిల్లాప‌రిష‌త్ సి.ఇ.ఓ. అశోక్ కుమార్‌, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. కె.జి.జె.నాయుడు, డి.ఇ. పి.చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
సిఫార్సు