చీపురుపల్లి మండలం పి.కె.పాలవలస గ్రామంలో హైస్కూలు మంజూరుకోసం చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. గ్రామపంచాయతీ పరిధిలోని బైరెడ్డిపేటలో రూ.40 లక్షల ఉపాధిహామీ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని అప్పాపురం మీదుగా ఈ గ్రామాన్ని అనుసంధానించేలా ఒక రోడ్డును మంజూరు చేస్తామన్నారు. తోటపల్లి కాలువ నీరు అందడం వల్లే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని, సంవత్సరం పొడవునా పంటలు పండి ఇక్కడి భూముల విలువ పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎలాంటి తప్పులు చేయవద్దని కోరారు. వారు ప్రభుత్వానికి కళ్లు, చెవులు వంటి వారని పేర్కొన్నారు. వారు చేసే తప్పులు ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఎలాంటి అవినీతికి, మధ్యవర్తులకు తావులేకుండా ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకే పథకాల సొమ్మును అందజేస్తుందని, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి పథకాల అమలులో గల తేడాను ప్రజలు గుర్తించాలని మంత్రి కోరారు.
జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పనిచేసే నాయకులను, పార్టీలను ప్రోత్సహించాలని కోరారు. ఈ మూడేళ్లలో ఒక్క పి.కె.పాలవలస గ్రామంలోనే సంక్షేమ పథకాల కింద రూ.12.40 కోట్లు లబ్దిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తోటపల్లి కాలువ రాక ముందు ఈ ప్రాంతం పూర్తి వర్షాధారంగా వుండేదని, పంటలు కూడా పరిస్థితి వుండేది కాదని ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. అటువంటిది నేడు తోటపల్లి కాలువలు వచ్చాక పంటలతో పచ్చగా వుంటున్నాయని, నాడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బొత్స సత్యనారాయణ కృషివల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. కార్యక్రమంలో ఎం.పి.పి. ఇప్పిలి వెంకటనరసమ్మ, జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, గ్రామ సర్పంచ్ జమ్ము సావిత్రి, చీపురుపల్లి ఆర్.డి.ఓ. అప్పారావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. అశోక్ కుమార్, పంచాయతీరాజ్ ఇ.ఇ. కె.జి.జె.నాయుడు, డి.ఇ. పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.