భారతదేశానికి అభివ్రుద్ధిలో ఏపీ దిక్సూచి


Ens Balu
10
కాకినాడ రూరల్
2022-08-18 11:34:10

అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తుందని కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీత పేర్కొన్నారు. గురువారం ఉదయం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం, కాకినాడ గ్రామీణ మండలం గంగనాపల్లి గ్రామంలో ప్రభుత్వ శాశ్వత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కురసాల కన్నబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లను ప్రారంభించారు. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగాగీత మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను ప్రజల వద్దకు, అందుబాటులో ఉంచాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించడం జరిగిందన్నారు. నేడు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తుందని ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రికే చెందుతుందని ఆమె తెలిపారు. గ్రామ సచివాలయ ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ భవనాలు ఒకే చోట ఒకే వరుసలో నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం గొప్ప శుభపరిణామన్నారు. ప్రభుత్వ సేవ నిమిత్తం ఒకసారి ప్రజలు ఈ ప్రాంతంలో అడుగుపెడితే వారు కావలసిన అన్ని ప్రభుత్వ సదుపాయాలు ఇక్కడ పొందవచ్చన్నారు. సచివాలయం, ఆర్బీకే, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, బిఎంసియు ఈ నాలుగు భవనాలు ఒకే ప్రాంగణంలో నిర్మించడంతో ఈ భవనాలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తాయని ఆమె తెలిపారు.  ఈ భవనాలు నిర్మాణాల కొరకు స్థానిక సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు.. అధికారులతో సమన్వయం చేసుకొని చక్కని కృషి చేశారని ఎంపీ అభినందించారు.

జిల్లాలో మొదటి సారిగా ప్రభుత్వ భవనాలు అన్ని ఒకే ప్రాంగణంలో..కలెక్టరు డా. కృతికా శుక్లా.. 
కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా మాట్లాడుతూ ఒక మోడల్ విలేజ్ గా జిల్లాలో అన్ని ప్రభుత్వ శాశ్వత భవనాలు గంగానపల్లి గ్రామంలో ఒకే చోట నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించి  గ్రామ సచివాలయం రూ.35 లక్షలు, రైతు భరోసా కేంద్రం రూ.21.80లక్షలు, వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ రూ.17.50లక్షలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ రూ.15.74 లక్షలతో నిర్మించడం జరిగిందని కలెక్టరు తెలిపారు. వీటితోపాటు మరో 16లక్షల రూపాయలు వ్యయంతో డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన కూడా చేశారన్నారు. 

 పెద్ద ఎత్తున పరిపాలన సంస్కరణలు 

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద సంకల్పంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూతనంగా గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థలు నెలకొల్పినట్టు కాకినాడ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కురసాల కన్నబాబు అన్నారు. ఈ వ్యవస్థలు రెండు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక వినూత్నమైన సంస్కరణలు ప్రారంభించడమే కాకుండా గ్రామస్థాయిలో,  క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పరిపాలన సంస్కరణలు జరుగుతున్నాయన్న విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వివిధ రాష్ట్రాలు ఈ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. కాకినాడ గ్రామీణ మండలం గంగనపల్లి గ్రామంలో ఒక మోడల్ ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందని, ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను ఒకచోటే లభ్యమయ్యే విధంగా ప్రభుత్వ భవనాలు ఒకే ప్రాంగణంలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ భవనాల ద్వారా గంగానపల్లి గ్రామం రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. 

రాష్ట్రమంతటా ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణ పనులు రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణం గా కొంతకాలం పనుల్లో జాప్యం జరిగిందని ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు చూపు, సంక్షేమం, అభివృద్ధిని నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం అమలు చేయడం ద్వారా భారతదేశంలో  ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రులలో అయిదవ స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కడం అభినందనీయమని కురసాల కన్నబాబు తెలిపారు. తొలుత నూతనంగా నిర్మించిన గంగానపల్లి ముఖ ద్వారమును ఎంపీ, కలెక్టరు, ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎం శ్రీనివాసు, ఏడీఎ పద్మశ్రీ, కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పీ. నారాయణమూర్తి, తహసీల్దార్ మురార్జీ, గంగనాపల్లి గ్రామ సర్పంచ్ గీసాల మహాలక్ష్మి, ఏఎంసీ చైర్ పర్సన్ జి. శ్రీనివాసు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు