గ్రామ సచివాలయాల్లో పట్టుమని వారి సర్వీసు మూడేళ్లు పూర్తిగా నిండలేదు.. నిన్నకాక మొన్ననే వారి 33నెలల సర్వీసు ప్రొభేషన్ రెగ్యులర్ అయ్యింది.. దానికంటే ముందుగానే ఒక్కొక్కరూ రూ.లక్షల్లో ఈ-క్రాప్ బుకింగ్ లో బినామీ పేర్లతో అవినీతి. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల నిలువుదోపిడీ.. ఏపీ సీఎం.వైఎస్.జగన్మోహనరెడ్డి దేశం మొత్తం తొంగి చూసేలా ఏర్పాటు చేసిన మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని అవినీతి.. ఇప్పటికే మూడు జిల్లాల్లో సుమారు 50 మందికి పైగా గ్రామీణ వ్యవసాయ, గ్రామీణ వాణిజ్యశాఖలకు చెందిన సహాయకుల సస్పెండ్.. కోట్లలో అవినీతి నమోదు..ఇదే ఇపుడు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో హాట్ టాపిక్. అసలు ఏ దైర్యంతో ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారో తెలియక ఇటు అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగాల్లో చేరిన కొత్తల్లోనే లక్షల రూపాయాల్లో అవినీతికి పాల్పడితే మొత్త సర్వీసులో వీరంతా ఏ స్థాయిలో స్కాములు చేస్తారోనంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సభలు సమావేశాల్లో ఎంతో ఘనంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోసం ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ..ప్రజలకు చేరువ చేస్తున్న వేళ..ఇదేశాఖలో నియమితులైన గ్రామీణ సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో చేసిన అవినీతి మిగిలిన ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి ఒక ప్రధాన చర్చగా మారిపోయింది. రాష్ట్రప్రభుత్వశాఖల చరిత్రలోనే అతిపెద్ద అవినీతిగా..అత్యధిక మంది సిబ్బంది పాలుపంచుకున్న స్కాముగా ఈ-క్రాప్ బినామీ బుకింగ్ స్కామ్ పేరుపొందింది.
అవినీతి జరిగిన విధానమెట్టిదనినా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రక్రుతి వైపరీత్యాల జరిగిన వెంటనే ఆదుకునేందుకు ఈ-క్రాప్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనితో నష్టపోయిన సాగు రైతులు ఎంత విస్తీర్ణంలో పంటలు నష్టపోయారో ఈవిధానం ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. సరిగ్గా ఇక్కడే గ్రామ, వార్డు సచివాలయశాఖలో సిబ్బందిగా వున్న గ్రామీణ వ్యవసాయ, వాణిజ్యపంటల సహాయకులు బినామీ రైతులు, బినామీ విస్తీర్ణం పేరుతో ఆన్ లైన్ లో పంటల నష్టాన్ని నమోదు చేశారు. పంటల నష్టంపై ప్రభుత్వానికి భారమైనా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సిబ్బంది నమోదు చేసిన నష్టానికి పరిహారం చెల్లించింది. కట్ చేస్తే సిబ్బంది నమోదు చేసిన సుమారు 60శాతానికి పైగా భూములు, పంట నష్టాలు అన్నీ బినామీ, నకిలీ అని ప్రభుత్వ ఉన్నతాధికారులకే అనుమానం కలిగింది. దీనితో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అనుకున్న మొత్తం కంటే ఎందుకు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందనే విషయంలో జిల్లాల్లోని వ్యవసాయశాఖ జెడీఏలు, ఏడీలు సచివాలయాల్లో పనిచేసే వీఏఏలకు, వీహెచ్ఏలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. దానితో సచివాలయ సిబ్బంది వాటికి ఇచ్చిన సమాధానాలు పొంతన కుదరకపోవడంతో అధికారులు లోతుగా విచారణ చేయడంతో సిబ్బంది అవినీతికి పాల్పడిన విషయం బట్టబయలు అయ్యింది. ఫలితంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 24 మందిని, పశ్చిమగోదావరి జిల్లాలో 23 మందిని, కాకినాడ జిల్లాలో ఒక్కరిని ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేశారు. పెద్ద ఎత్తున వ్యవసాయ, వాణిజ్య పంటలశాఖలో జరిగిన అవినీతి గుప్పుమని బయటకు పొక్కింది.
4 జిల్లాల్లో 227 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో జరిగిన అవినీతికి సంబంధించి ఇప్పటి వరకూ శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లాలో 64 మందికి, కాకినాడ జిల్లాలో 80 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో 84 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 25 మంది, గ్రామీణ వ్యవసాయ, వాణిజ్య పంటల సహాయకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే దానికి సచివాలయ వీఏఏలు, వీహెచ్ఏల నుంచి వచ్చిన సమాధానాలు సంత్రుప్తికంగా లేవని అధికారులే నిగ్గు తేల్చారు. ఇదే సమయంలో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో షోకాజ్ విచారణ దశలోనే ఉండిపోయింది. కాని మూడు జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా సచివాలయ సిబ్బంది చేసిన తప్పు తేలడంతో నిందితులైన వారందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు.
రెవిన్యూశాఖకు వాటా ఇవ్వనందుకే అసలు ముసలం..
ప్రభుత్వశాఖలైన ఆగ్రికల్చర్, హార్టికల్చర్ కు చెంది గ్రామ సచివాలయ సహాయకులు బినామీ పేర్లతో ఈ-క్రాప్ బుకింగ్ చేయడం.. ఆపై జిల్లా అధికారులు విచారణ చేసిన సమయంలో రెవిన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, ఆర్ఐలు ద్వారా అధికారులు సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో నొక్కేసిన మొత్తంలో వాటాలు ఇచ్చిన చోట మాత్రం రికార్డులన్నీ బాగానే ఉన్నాయని..వాటాల పంపకాలు కుదరని చోట మాత్రమే అవినీతి బయటకు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కొద్ది సమయంలోనే లక్షల రూపాయలు బినామీ పేర్లు పెట్టి.. ఆమొత్తాలను రైతుల ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్టు తెలుసుకున్న రెవిన్యూశాఖ సిబ్బంది గ్రామస్థాయిలో కొర్రీలు వేయడం ప్రారంభించిందని చెబుతున్నారు. మొత్తానికి పంపకాల్లోని తేడాల వలనే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయాల్లో జరిగిన అవినీతి బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. విశేషం ఏంటంటే ఉబయ గోదావరి జిల్లాల్లో చాలా మంది వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన వారు కూడా ఈ అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా నొక్కేసిన మొత్తంలో ఇటు మూడు శాఖలకు చెందిన గ్రామీణ సహాయకులు వారి వారి జిల్లా అధికారులకు కూడా ముడుపులు ఇవ్వాలని అక్కడ పర్శంటేజీల్లో తేడాలు బెడిసికొట్టిన పిదప అసలు విషయం రచ్చ రచ్చ అయినట్టు ఇపుడు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారని తెలిసింది..
అవినీతి రుజువైనా విచారణలతోనే కాలక్షేపం..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయ శాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, రెవిన్యూ విభాగాలకు చెందిన గ్రామీణ సహాయకులు కోట్లలో అవినీతికి పాల్పడినా ఇటు ప్రభుత్వం, జిల్లా అధికారులు షోకాజు నోటీసుల పేరుతో కాలయాపన చేయడం..కొన్ని జిల్లాల్లో సస్పెండ్ లు చేసి చేతులు దులుపుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ..షోకాజు నోటీసులు అందుకున్నవారు ఇచ్చిన సంజాయిషీలు సంత్రుప్తికరంగా లేవంటూనే విచారణ కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు విచారణ విశేషాలను జెసీలు, జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నామని చెబుతున్న జిల్లా అధికారులు చెప్పే మాటలకు కూడా పొంతన అస్సలు కుదరడం లేదు. ప్రభుత్వ ఉద్యోగలంలోకి వచ్చిన 33నెలలకే లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కేవలం సస్పెండ్ లు చేసి.. రికవరీలకు పూనుకోవాలని చూడటం పట్ల కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మరోవైపు ప్రభుత్వంలోని కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖలో వెలుగుచూసిన ఈ భారీ స్కామ్ పై ఆధారాలు సేకరించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగడం కూడా విశేషం.. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి వ్యవసాశాఖ ముఖ్యకార్యదర్శి నుంచిగానీ, ప్రభుత్వం నుంచి నేటి వరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు. చూడాలి ప్రభుత్వశాఖలో అతి పెద్ద భారీ అవినీతి విషయంలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!