రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థకు గొలుగొండ మండలంలోని జోగుంపేటలో సచివాలయ ఉద్యోగస్తులు మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక(ఆర్టీఐ) గొలుగొండ మండల అధ్యక్షులు దుల్ల వీరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రజల వద్దకే పాలన అందించాలని ఉద్దేశంతో గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి అన్ని సేవలు అందించేలా ఉద్యోగులను నియమించారని ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను మానస పుత్రికగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థను జోగుంపేట సచివాలయ ఉద్యోగస్తులు సమయపాలన పాటించకుండా విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తూ అందుబాటులో ఉండకుండా గైర్హాజరవుతున్నారని ఆరోపించారు. ఉద్యోగస్తులపై మండల స్థాయిలో అనేకసార్లు ఫిర్యాదులు అందాయని అయినప్పటికీ అటు అధికారులు, ఇటు సచివాలయ ఉద్యోగుల్లోనూ మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న మంగళవారం నాడు 10:30 సమయం దాటిపోతున్నా ఉద్యోగస్తులు హాజరు కాకపోవడంతో కార్యాలయం తెరవకపోవడంతో స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారని ఇంత జరుగుతున్నప్పటికీ మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నారని ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ ద్రుష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామని హెచ్చరించారు.