మనబడి నాడు-నేడు కార్యక్రమం పనులు సంతృప్తికర స్థాయిలో నిర్మాణాలు జరిపి ,విద్యా బోధనకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. బుధవారం పాలకొల్లు మండలం లంకలకొడేరు జిల్లా పరిషత్ హై స్కూలు, దగ్గులూరు యం పి ఎలిమెంటరీ స్కూలు నాడు - నేడు కార్యక్రమం భాగంగా చేపట్టిన పనులను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీలు చేశారు. మనబడి - నాడు-నేడు రెండవ విడత కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరు అయిన పనులు వివరాలను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతంగా పూర్తి చేసి, విద్యా బోధనకు ఏ ఇబ్బందులు లేకుండా చెయ్యాలని ఆమె అన్నారు. పనులకు సంబంధించి ఇసుక, సిమెంటు తదితర సామగ్రి అందుబాటులో పెట్టుకుని భద్ర పరచు కోవాలని ఆమె సూచించారు. పరిసరాలను ,మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉంచాలని,విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు.
తరగతి గదులకు వెళ్లి విద్యార్థిని, విద్యార్థులతో కొంత సేపు జిల్లా కలెక్టరు గడిపి వారిని కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. చదువు వలన కలిగే ప్రయోజనాలను విద్యార్ధులకు వివరించి , ఉన్నత స్థాయిలో ఉన్న వారిని, దేశ నాయకులను స్ఫూర్తిని తీసుకుని చక్కని క్రమ శిక్షణతో కూడిన జ్ఞానాన్ని సంపాదించుకుని రేపటి తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె అన్నారు. పాటశాలల్లో ఏమైనా సమస్యలు వున్నాయా అని విద్యార్థులను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ .వెంకట రమణ, తహ శీల్దారు జి . మమ్మీ ,యం పి డి వో యస్. వెంకటేశ్వర రావు, ఇ వో పి ఆర్ డి షరీఫ్ ,సచివాలయం సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.