పశువులకు బొబ్బర వ్యాధి (lumpy skin) నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆరిక ఈశ్వర రావు కోరారు. బొబ్బర వ్యాధి రాజస్థాన్,బీహార్, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాలలో తీవ్రంగా వ్యాపించి చాలా పశువులు మృత్యువాత పడ్డాయని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో తీవ్రంగా వున్నందున మన జిల్లా సరిహద్దు 6 మండలాలలో 64 గ్రామాలలో ఐదు కిలో మీటర్ల పరిధిలో సుమారు 10 వేల పశువులకు టీకాలు వేయించే కార్యక్రమం జరుగుతుందని వివరించారు. జిల్లాకు 33 వేల డోసుల వాక్సిన్ సిద్దంగా వుందని, సరిహద్దు గ్రామాల్లో వేసిన తర్వాత మిగతా పశువులకు కూడా వేయడం జరుగుతోందని చెప్పారు. బొబ్బర వ్యాధి ముఖ్యంగా తెల్ల జాతి పశువులకు (ఆవులు, యెద్దులు) సోకుతుందని ఆయన పేర్కొన్నారు. శరీరం అంతా కడతలు లాగా బొబ్బర్లు వస్తాయని, అవి కురుపులుగా మారి చీము పడుతుందని, జ్వరం వుంటుందని ఆయన అన్నారు. పాలు ఇచ్చే పశువులకు పాల దిగుబడి తగ్గుతుందని, మేత మేయవని, పశువులు నీరసంగా వుంటాయని వ్యాధి లక్షణాలను వివరించారు. రైతులు ఆర్ధికంగా నష్టపోయే అవాశముందని, రైతులు ముందుగానే మేల్కొని వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని కోరారు.