అనకాపల్లి జిల్లాలో చేపట్టిన రీ సర్వే, ఈ-క్రాప్ నమోదు ఖచ్చితంగా ఉండాలని కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చోడవరం మండలంలో పర్యటించి తాసిల్దార్ కార్యాలయంలో భూమి రీ సర్వే రికార్డులను పరిశీలించారు. రీ సర్వే మూలంగా రైతుకు మేలు జరుగుతుందని, సరిహద్దులు స్పష్టంగా ఉంటాయని చెప్పారు. ఎటువంటి లోపాలు లేకుండా ఈ సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తరువాత మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఈ-క్రాప్ నమోదును పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. వేసిన పంట నమోదు చేయడం పక్కాగా ఉండాలని, ఈ-క్రాప్ ను అనుసరించే రైతుకు ధాన్యం సేకరణ, పంటల బీమా మంజూరు చేయబడుతుంది అన్నారు. ఈ నెల 31వ తేదీ లోగా ఈ క్రాప్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే, ఈ క్రాప్ ల నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీటి మూలంగా వారికి కలిగే లాభాలను గురించి వివరించాలని చెప్పారు. ఈ పర్యటనలో తాసిల్దార్ తిరుమల బాబు, సర్వే అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.