విజయనగరం జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో పదో తరగతి ఫలితాలు మరింతగా మెరుగుపరచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున ఆదేశించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్‌లు, బోధన సిబ్బంది, విద్యార్ధులు కలసి ఈ దిశగా మరింత కృషి చేయాలని సూచించారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మంత్రి స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్ తరగతి గదులను సందర్శించి విద్యార్ధులతో మాట్లాడారు. గురుకులంలో కల్పిస్తున్న భోజన సౌకర్యంపై విద్యార్ధులను ప్రశ్నించారు. భోజనం బాగుందని పలువురు విద్యార్ధులు మంత్రికి వివరించారు. పాఠశాలలో మౌళిక వసతులపై మంత్రి ఆరా తీశారు. విద్యార్ధుల విద్యా ప్రమాణాల గురించి మంత్రి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఫలితాలు తక్కువగా వున్నాయని, ఫలితాలు మెరుగుపరిచేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గురుకులాల సమన్వయ అధికారిణి చంద్రావతికి సూచించారు.
గురుకులాల్లో నాడు- నేడు కింద మౌళిక వసతులను కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్ధులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ఇక్కడి విద్యార్ధులంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారంతా చదువుపై దృష్టిసారించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని, హాస్టళ్లలో చదివే ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేస్తూ కష్టపడి చదివితేనే భవిష్యత్తు వుంటుందన్నారు. కొప్పెర్ల గురుకులంలో వసతుల కల్పనకోసం చేపట్టిన చర్యలను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మంత్రికి వివరించారు. రూ.2 కోట్ల సి.ఎస్.ఆర్. నిధులతో కొన్ని భవనాలను నిర్మించామని, మరో రూ.1 కోటి జెడ్పీ నిధులతో మరికొన్ని భవనాలకు ప్రతిపాదించామన్నారు. ఈ పర్యటనలో గురుకులాల జిల్లా సమన్వయ అధికారిణి చంద్రావతి, ఎస్.సి.కార్పొరేషన్ ఇన్ ఛార్జి ఇ.డి. సుదర్శన దొర, తహశీల్దార్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.