రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గూండాల రాజ్యం నడుస్తోందని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వైసీపీ అడ్డంకులు సృష్టించడాన్ని, అన్న క్యాంటీన్ భవనాన్ని ధ్వంసం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. నిరుపేదల కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడాన్ని బట్టి వైఎస్సార్సీపీ పరిపాలన ఎలా వుందో ప్రజలకి అర్థమవుతోందన్నారు. 2024లో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, వైఎస్సార్సీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అధికారపార్టీ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని విమర్శించారు. నేడు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికి బట్టకట్టలేని దుస్థితి నెలకొందన్నారు.
చివరకు ఎన్టీఆర్ పాలనలో కట్టిన ఇళ్లకు కూడా జగన్ ప్రభుత్వం ఓటీఎస్ పేరిట డబ్బులు వసూలు చేస్తుందంటే రాష్ట్రంలో అరాచక పాలనను అర్థం చేసుకోవచ్చునన్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు వద్ద వైఎస్సార్సీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో టిడిపి హయంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ వైఎస్సార్సీపీ అభివృద్ధి చేసినది కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.